
ప్రేమ బాస
‘చేతిలో చెయ్యేసి చెప్పు బావా... చేసుకున్న బాసలు చెరిగిపోవని’ అంటూ ఓ మరదలు పిల్ల బావను ప్రేమగా వేడుకుంటుంది. ‘ఒట్టేసి చెబుతున్నా వింటున్నావా ఓ మైనా...నువ్వంటే నేనేనని’ అంటూ ఓ ప్రేమికుడు తన ప్రియురాలితో బాసలు చేసుకుంటాడు. సినీ సాహిత్యంలోనే కాదు... జీవన సాంగత్యంలోనూ వట్టి మాటకు విలువ లేదు. అలవోకగా చెప్పే నోటి మాట కంటే... చేతిలో చెయ్యేసి చేసే ఒట్టుకే విలువెక్కువ. తేలికైన మాటను బలమైన బాసగా చేసే ప్రామిస్‌కి బలమెక్కువ!
..:: సమీర నేలపూడి
ప్రేమ మందిరం నిలబడాలంటే... దానికి నమ్మకం అనే బలమైన పునాది కావాలి. అయితే ఆ పునాది వేయడం అంత తేలిక కాదు. ‘నీ కోసమే నేను జీవిస్తాను, నీ సుఖ సంతోషాలే ధ్యేయంగా బతుకు సాగిస్తాను’ అంటూ సింపుల్‌గా చెప్పేయొచ్చు. కానీ చెప్పినంత ఈజీగా అవతలి వారు దాన్ని నమ్మలేరు. ఎందుకంటే వాగ్దానం భవిష్యత్తుకు సంబంధించినది. దాన్ని నిలుపుకొంటారా లేదా అన్నది భవిష్యత్‌లోనే తెలుస్తుంది. అలాంటప్పుడు వర్తమానంలో దాన్ని నమ్మడం, ఆ నమ్మకంతోనే జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడిపోవడం అంత సులభం కాదు. కాకపోతే దాన్ని సులభతరం చేసే శక్తి ఒక్కదానికి ఉంది. అదే... ప్రామిస్!
ప్రపోజల్ నోటి నుంచి వస్తుంది. ప్రామిస్ మనసు నుంచి వస్తుంది. అందుకే... నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఒక అబ్బాయి చెప్పినప్పుడు ఆలోచనలో పడే అమ్మాయి... అంతవరకూ పెద్దగా పరిచయం లేని ఓ కొత్త వ్యక్తి పెళ్లి పీటల మీద కూర్చుని, ‘జీవితాంతం నీకు అండగా ఉంటాను’ అంటూ చేసే ప్రమాణానికి సంతోషపడుతుంది. తన జీవితాన్ని అతనికి అంకితం చేయడానికి సిద్ధపడుతుంది. దానికి కారణం... అతడు ఏదో మామూలుగా చెప్పేయడం లేదు. అగ్ని సాక్షిగా ఒట్టు వేస్తున్నాడు. అందుకే ఆమె నమ్ముతుంది.
పెళ్లిలోనే కాదు.. ప్రేమలోనూ ఈ నమ్మకం కావాలి. మీ ప్రేమను వెల్లడి చేసి వదిలేస్తే లాభం లేదు. ఆ ప్రేమ ఎంత బలమైనదో నిరూపించాలి. తన కోసం మీరు ఏం చేయగలరో తెలిసేలా చేయాలి. ఐలవ్యూ అంటూ ప్రపోజ్ చేసి వదిలేయకుండా... ‘ఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ’ అంటూ ప్రామిస్ చేయాలి. దాని కోసమే వాలంటైన్ వీక్‌లో ఐదో రోజును ‘ప్రామిస్ డే’గా నిర్ణయించారు. మీరు ఇప్పటికే ప్రేమను తనకు వెల్లడించారు. గులాబీ గుత్తుల ద్వారా తన గుండెల్లో ప్రవేశించే
ప్రయత్నం చేశారు. చాక్లెట్లతో తీయని అనుభూతిని సొంతం చేసుకున్నారు. టెడ్డీ బేర్‌ని ఇచ్చి మనసులో చోటు సంపాదించారు. ఇవాళ ప్రామిస్ డే. భవిష్యత్తులో మీరు తనకు ఇవ్వబోయే ఆనందాల గురించి భరోసా కల్పించే రోజు. మీ ప్రేమను పొందడం అదృష్టం అని అర్థమయ్యేలా చేసేందుకు ఇదొక మంచి అవకాశం. తన కోసమే మీరు, తనతోనే మీరు అని మాట ఇవ్వండి. మీ జీవితంలో తన విలువ ఏమిటో తెలియజేయండి. తన కోసం మీరేం చేయగలరో ఒట్టేసి చెప్పండి. అన్నట్టు.. మీ ప్రామిస్‌ను అందమైన దృశ్యకావ్యంగా మలుచుకునేందుకు సిటీలో అందమైన స్పాట్స్ చాలా ఉన్నాయి. ఉద్యానవనాలు, విహార ప్రాంతాలు, కేఫ్.. మీ యాటిట్యూడ్‌కి తగ్గ ప్రాంతాన్ని ఎంచుకోండి. ఎన్నో మధురానుభూతులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి... ప్రామిస్!.