ప్రాణం మీదకు తెచ్చిన మ్యాజిక్
♦ విజిల్ మింగిన విద్యార్థి
♦ శ్వాసనాళంలో ఇరుక్కుని అవస్థలు
♦ విజయవంతంగా బయటికి తీసిన గాంధీ వైద్యులు
గాంధీ ఆస్పత్రి: డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి ప్రమాదవశాత్తు విజల్‌ను మింగాడు. నోటి నుంచి మాటకు బదులుగా విజిల్ సౌండ్ రావడంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఈఎన్‌టీ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి శ్వాసనాళంలో ఇరుకున్న విజల్‌ను విజయవంతంగా బయటికు తీయడంతో ప్రాణాపా యం తప్పింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్, ఈఎన్‌టీ హెచ్‌ఓడీ హన్మంతరావు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఒండ్రుగొండకు చెందిన భిక్షపతి (21) డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
బుధవారం ఇంట్లో విజిల్ ఊదుతూ చిన్నపిల్లలతో ఆడుకుంటున్నాడు. మ్యాజిక్ చేయాలని పిల్లలు కోరడంతో విజల్‌ను నోటి లోపలదాచుకున్నాడు. ఇదే సమయంలో ఓ చిన్నారి భిక్షపతి కడుపుపై సరదాగా కొట్టడంతో పెద్దగా ఊపిరితీసుకున్నాడు.దీంతో నోట్లో ఉన్న విజిల్ ప్రమాదవశాత్తు గొంతులోకి జారిపోయి ఎడమవైపు ఊపిరితిత్తి శ్వాసనాళంలో ఇరుక్కుంది. పలువిధాలుగా యత్నించిన విజిల్ బయటకు రాకపోవడంతోపాటు మాటలకు బదులుగా విజిల్ సౌండ్ రావడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు స్ధానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు.
సూర్యాపేట వైద్యుల సూచన మేరకు నగరంలోని కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి తీసుకురాగా, ప్రాణాలకు ప్రమాదం ఉందని అక్కడి వైద్యులు చెప్పడంతో గురువారం గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగానికి వచ్చారు. ఇటీవల విజిల్ మింగిన చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడిన ఈఎన్‌టీ వైద్యులకు సమాచారం అందించారు. ఈఎన్‌టీ విభాగాధికారి హన్మంతరావు ఆధ్వర్యంలో వైద్యపరీక్షలు నిర్వహించి ఎడమ ఊపిరితిత్తి శ్వాసనాళంలో విజిల్ ఇరుక్కున్నట్లు గుర్తించారు. బ్రాంకోస్కోపీతో పాటు ట్రకాస్టమీ సర్జరీలు నిర్వహించి విజిల్‌ను విజయవంతంగా బయటకు తీశారు.
బాధితుడు బిక్షపతి కోలుకుంటున్నాడు. శ్వాసనాళంలో ఇరుకున్న విజిల్‌ను తొలగించకుంటే ఇన్‌ఫెక్షన్‌కు గురై ప్రాణాపాయం సంభవించేందని వైద్యులు తెలిపారు. గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా ఆపరేషన్ నిర్వహించినట్లు సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. సర్జరీని విజయవంతంగా నిర్వహించిన వైద్యులు హన్మంతరావు, శ్రీకాంత్, వెంకటరామిరెడ్డి, అరుణ, అప్పారావు, సాధన, సంజీవ్, శ్యాంసన్, రాథోడ్, పీజీలు సునీల్, అభినవ్, చంద్రశేఖర్, డిపిన్, శ్రావణి వైద్య ఉన్నతాధికారులు అభినందించారు.