
మళ్లీ అదే తప్పు చేస్తున్నారు
♦ ఒకే ప్రాంతంలో 9 నగరాలా?
♦ అన్ని ప్రాంతాలనూ సమంగా చూడాలని విపక్షం డిమాండ్
సాక్షి, హైదరాబాద్: కేంద్రీకృత అభివృద్ధితో వచ్చిన సమస్యల్ని పరిగణనలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి అవే తప్పులు చేస్తున్నారని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ప్రాంతాల మధ్య అసమానతలను, అవసరాలను, ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై బుధవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చను టీడీపీ సభ్యుడు బీకే పార్థసారథి ప్రారంభిస్తూ రాయలసీమ ఎడా రిగా మారడానికి కాంగ్రెసే కారణమన్నారు.
9 నగరాలూ ఒకే చోట ఎందుకు?
శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణ కమిటీలను తుంగలో తొక్కి చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి మొత్తాన్నీ ఒకే చోట కేంద్రీకరిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. పాత అనుభవాలను మరిచి చంద్రబాబు మళ్లీ అవే తప్పుల్ని చేస్తున్నారని, ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతంలో అన్ని రకాల నగరాలను నిర్మిస్తామని చెబుతున్నారని, ఇలా అయితే సమతులాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. 9 నగరాలు అమరావతి ప్రాంతంలో కట్టే బదులు తమ ప్రాంతాన్ని రెండో రాజధానిగాచేసి హైకోర్టును అక్కడ పెట్టొచ్చుకదా? అని నిలదీశారు.
ఇది అప్ అండ్ డౌన్ ప్రభుత్వమా?
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం సూచిస్తున్న అభివృద్ధి ఆర్థిక నమూనాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. విభజన నుంచి గుణపాఠం నేర్చుకున్నట్టు కనిపించడం లేదన్నారు. చివరకు పరిపాలన ఎక్కడి నుంచి సాగుతుందో కూడా ప్రజలకు అర్థం కావడం లేదని, మంత్రులు విజయవాడలో, అధికారులు హైదరాబాద్‌లో ఉంటూ ‘అప్ అండ్ డౌన్’ ప్రభుత్వంగా మారిందన్నారు.
సమతులాభివృద్ధే ధ్యేయం: మృణాళిని
అనంతరం చర్చకు మంత్రి మృణాళిని సమాధానం చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, సమతులాభివృద్ధికి చేపట్టిన చర్యలను వివరించారు. ప్రాంతాల వారీగానే కాకుండా మండలాల వారీగా వెనుకబాటు తనాన్ని గుర్తించి అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం యోచిస్తున్నట్టు వివరించారు. ఏ ప్రాంతానికీ అన్యాయం చేయబోమన్నారు.