వినాయక నిమజ్జనం చూపిస్తానని తీసుకెళ్లి వరుసకు మేనమామ అయిన వ్యక్తి ఓ బాలికపై అత్యాచారయత్నం చేశాడు.
సైదాబాద్: వినాయక నిమజ్జనం చూపిస్తానని తీసుకెళ్లి వరుసకు మేనమామ అయిన వ్యక్తి ఓ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 17న జరుగగా ఆలస్యంగా మంగళవారం వెలుగు చూసింది. నేపాల్‌కు చెందిన తులసి(35) ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి సింగరేణి వాంబే కాలనీలో నివాసం ఉండేవాడు. పూట గడవడానికి ఆటో నడపడం, వాచ్‌మెన్‌గా పనిచేయడం, బ్యాండ్ మేళాలు వాయించడం వంటివి చేస్తుంటాడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉండగా కొంత కాలంగా తన మకాంను చర్లపల్లి మార్చాడు.
సింగరేణి కాలనీలో ఉండగా పక్కనే ఉండే వరుసకు కోడలు అయ్యే నేపాల్‌కు చెందిన బాలికతో పరిచయం పెంచుకున్నాడు. కాగా ఈ నెల 17న వినాయక నిమజ్జనం చూపిస్తానని చెప్పి బాలిక(11)ను తులసి తన ఆటోలో చర్లపల్లిలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. అక్కడి నుంచి బాలికను తన ఆటోలోనే సింగరేణి కాలనీకి తీసుకొచ్చి వదిలేశాడు. అయితే బాలిక జరిగిన విషయాన్ని ఆలస్యంగా కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో వారు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది.