వైద్య సేవలు, ఆస్పత్రులు సూపర్ స్పెషాలిటీ వైపు అడుగులు | Medical services, hospitals towards Super Specialty | Sakshi
Sakshi News home page

వైద్య సేవలు, ఆస్పత్రులు సూపర్ స్పెషాలిటీ వైపు అడుగులు

Published Wed, Jun 1 2016 3:18 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

వైద్య సేవలు, ఆస్పత్రులు సూపర్ స్పెషాలిటీ వైపు అడుగులు - Sakshi

వైద్య సేవలు, ఆస్పత్రులు సూపర్ స్పెషాలిటీ వైపు అడుగులు

- రాష్ట్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ఏర్పాట్లు
హైదరాబాద్‌లో నలుదిక్కులా నాలుగు సూపర్ స్పెషాలిటీలు
కరీంనగర్, ఖమ్మంలలో కూడా ఏర్పాటు
నల్లగొండకు బీబీనగర్ సేవలు ప్రారంభం... 2017లో పీజీ వైద్య కాలేజీ
మహబూబ్‌నగర్‌లో మెడికల్ కాలేజీ... అనుబంధంగా అధునాతన వైద్యం
ప్రభుత్వాస్పత్రుల్లో 10% పెరిగిన ఆరోగ్యశ్రీ రోగులు
రెండేళ్లలో వైద్య ఆరోగ్యశాఖ సాధించిన విజయాలు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి ప్రారంభించింది. రెండేళ్లలో అనేక విజయాలు సాధించిన వైద్య ఆరోగ్యశాఖ భారీగా భవిష్యత్తు ప్రణాళికలు రచించింది. హైదరాబాద్‌కు నలువైపులా నాలుగు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం వాటికి రూపకల్పన చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఉప్పల్-ఎల్‌బీ నగర్, మల్కాజ్‌గిరి-కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్-కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి-రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ఒకటి చొప్పున మొత్తం నాలుగు పెద్దాస్పత్రులు నిర్మించాలనేది సర్కారు ఆలోచన. హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి ఆస్పత్రిని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయించింది. రాజధానిలో నిర్మించనున్న ఈ ఆసుపత్రుల్లో మహిళలు, పిల్లల సంరక్షణతోపాటు ఇతర అన్ని రకాల వైద్య సేవలను ప్రభుత్వం అందించనుంది.

అలాగే వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి ప్రస్తుత భవనంలో మహిళ, పిల్లల సంక్షేమం కోసం ప్రత్యేకంగా టవర్లు నిర్మించనుంది. వరంగల్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాన్ని సర్కారు చేపట్టనుంది. వరంగల్‌లో ఆరోగ్య విశ్వవిద్యాలయం, మెడికల్ కాలేజీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించనుంది. కరీంనగర్, ఖమ్మంలలోనూ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలను చేపట్టనుంది. వీటన్నింటికీ సుమారు రూ. వెయ్యి కోట్లు ఖర్చుకానుంది. అలాగే నిమ్స్‌లో కిడ్నీ టవర్, ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలో 24 అంతస్తులుగల రెండు టవర్లతో భారీ భవనాలు నిర్మించనుంది. అందులో అత్యాధునిక సదుపాయాలతో 2,500 పడకలతో రోగులకు సేవలు అందించనుంది.

ప్రతి జిల్లాలోనూ వెయ్యి పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలనేది సర్కారు ఉద్దేశం. 20 వేల నుంచి 25 వేల జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలని, ప్రతి నియోజకవర్గంలో 100 గ్రామాలకు ఉపయోగపడేలా ఏరియా ఆస్పత్రి నెలకొల్పనుంది. భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఆరోగ్య జిల్లాలను ఏర్పాటు చేయనుంది. పీహెచ్‌సీలను 30 పడకల ఆస్పత్రులుగా, ఏరియా ఆస్పత్రులను 100 పడకలుగా, జిల్లా ఆస్పత్రులను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులుగా ఆధునీకరించనుంది. ప్రతి జిల్లాలో కనీసం నాలుగు చోట్ల... రాష్ట్రవ్యాప్తంగా 40 చోట్ల ఎంఆర్‌ఐ, సీటీస్కాన్, అల్ట్రా సౌండ్, మామోగ్రఫీ ఏర్పాటు చేయాలనేది సీఎం ఆకాంక్షగా ఉంది.

 మహబూబ్‌నగర్‌కు మెడికల్ కాలేజీ... బీబీనగర్‌లో పీజీ వైద్య కాలేజీ
 మహబూబ్‌నగర్‌కు మెడికల్ కాలేజీ మంజూరైంది. 150 ఎంబీబీఎస్ సీట్లతో ఈ ఏడాది నుంచే కాలేజీ ప్రారంభం కానుంది. మరోవైపు రాష్ట్రంలో వివిధచోట్ల 200 వరకు ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. 20 నుంచి 30 వరకు పీజీ వైద్య సీట్లూ పెరిగాయి. బీబీనగర్ నిమ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అక్కడ ప్రస్తుతం ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. త్వరలో ఐపీ సేవలనూ ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి బీబీనగర్‌లో పీజీ వైద్య కళాశాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీంతో అక్కడ 20 నుంచి 30 వరకు సూపర్ స్పెషాలిటీ పీజీ వైద్య సీట్లు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ నిమ్స్‌లో సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లను వినియోగంలోకి తీసుకొచ్చారు. దీంతో అదనంగా 500 పడకలు వినియోగంలోకి వచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వరంగల్, ఆదిలాబాద్‌లలో రూ. 150 కోట్ల చొప్పున సూపర్ స్పెషాలిటీ టవర్స్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. స్థల సేకరణ కూడా పూర్తయింది. టెండర్లు కూడా ఖరారయ్యాయి. కేంద్రం హెచ్‌ఎల్‌ఎల్ కంపెనీకి నిర్మాణ బాధ్యత అప్పగించింది. ఇవి పూర్తయితే 200 పడకలతో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి.

 40 డయాలసిస్... 40 డయాగ్నొస్టిక్ సెంటర్లు
 జిల్లా కేంద్రాలు, ముఖ్యమైన ఏరియా ఆస్పత్రుల్లో 40 డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే 40 డయాగ్నొస్టిక్ కేంద్రాలూ అందుబాటులోకి రానున్నాయి. అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ఐసీయూలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే మహబూబ్‌నగర్, సిద్దిపేట్, కరీంనగర్‌లలో ఐసీయూలను ఏర్పాటు చేశారు. కామారెడ్డిలో ఐసీయూ సహా ట్రామాకేర్ యూనిట్‌ను నెలకొల్పారు. త్వరలో ఆదిలాబాద్‌లో ఐసీయూ, ట్రామాకేర్ యూనిట్లను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిని రూ. 120 కోట్లతో ఆధునీకరించనున్నారు.

 బడ్జెట్‌లో రూ. వెయ్యి కోట్లు అదనం
 వైద్య ఆరోగ్యశాఖకు 2016-17 బడ్జెట్లో రూ. 5,966.89 కోట్లు కేటాయించారు. గతేడాదికన్నా ఇది రూ. 1,036 కోట్లు అదనం. హైదరాబాద్‌లో నాలుగు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం ఇందులో కీలక  అంశం. వైద్య పరికరాల కొనుగోలు, ఉన్నవాటిని మార్చడానికి రూ. 600 కోట్లు కేటాయించారు. డయాగ్నొస్టిక్ పరికరాలు, పాత పడకల మార్పు, సివిల్ పనుల మరమ్మతులకు రూ. 316 కోట్లు కేటాయించారు. ఔషధాలు తదితరాల కోసం రూ. 225 కోట్లు కేటాయించారు. పారిశుద్ధ్యం, భద్రత సేవల కోసం రూ. 100 కోట్లు కేటాయించారు. వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) విభాగానికి రూ. 784.87 కోట్లు కేటాయించారు. ఆరోగ్యశ్రీకి రూ. 344 కోట్లు కేటాయించారు. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ఫ్లాన్ నిధుల నుంచి రూ. 120 కోట్లు ఆరోగ్యశ్రీకి కేటాయించారు. వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణానికి రూ. 189 కోట్లు కేటాయించారు.
 
 తగ్గిన శిశు మరణాలు...పెరిగిన ఆరోగ్యశ్రీ రోగులు
 తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో శిశు మరణాల రేటు తగ్గింది. గతంలో శిశు మరణాల రేటు ప్రతి వెయ్యి జననాలకు 38 మరణాలుగా ఉండగా ఇప్పుడది 28కి తగ్గింది. వైద్యపరంగా ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో తీసుకున్న చర్యలు ఇందుకు దోహదపడ్డాయి. అలాగే చిన్నారులకు వ్యాక్సిన్ల కోసం కేంద్రం చేపట్టిన ఇంద్రధనస్సు కార్యక్రమం రాష్ర్టంలో విజయవంతమైంది. ఇందుకు ప్రధానమంత్రి ప్రశంసలు కూడా లభించాయి. ప్రభుత్వాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలూ పెరిగాయి. గతంలో ‘ఆరోగ్యశ్రీ’ రోగుల సంఖ్య ప్రభుత్వాస్పత్రుల్లో 30 శాతం, ప్రైవేటు ఆస్పత్రుల్లో 70 శాతంగా ఉండగా ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ రోగుల సంఖ్య 40 శాతానికి చేరుకుంది. ప్రభుత్వాస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు మెరుగుపడటం వల్లే ఇది సాధ్యమైంది.
 
 2,118 వైద్య పోస్టుల భర్తీకి ఏర్పాట్లు...

 రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైద్య, ఇతర సిబ్బంది పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రానుంది. మరోవైపు ఆరోగ్యశ్రీ ట్రస్టు రూపొందించిన మొబైల్ యాప్‌ను ఇటీవలే రూపొందించారు. ఈ యాప్ ద్వారా 77.19 లక్షల మంది పేద కుటుంబాలు, 11.45 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పింఛన్‌దారులు, 23 వేల మంది వర్కింగ్, రిటైర్డ్ జర్నలిస్టులు ప్రయోజనం పొందనున్నారు. యాప్ వాడకందారులకు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల వివరాలు జీపీఎస్ ద్వారా ప్రత్యక్షమవుతాయని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement