మార్చి 21 నుంచి మెట్రో పరుగులు
45 రోజుల్లోగా ప్రాజెక్టుకు అవసరమైన
ఆస్తులను సేకరించాలి: తెలంగాణ సీఎస్
టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
ఇక నుంచి ప్రతి మంగళవారం పనుల పురోగతిపై సమీక్ష
తొలి దశలో నాగోలు - మెట్టుగూడ రూట్లో రోజూ తొమ్మిది రైళ్లు
అలైన్‌మెంట్ మార్పుపై నెలాఖరులోగా ఎల్ అండ్ టీకి లేఖ
సాక్షి, హైదరాబాద్: వచ్చే మార్చి 21 నుంచి మెట్రో రైళ్లు పరుగు పెట్టనున్న నేపథ్యంలో... ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణను 45 రోజుల్లోగా పూర్తిచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు 2017 నాటికి మూడు కారిడార్లలో మెట్రో ప్రాజెక్టును పూర్తిచేయాలని ఆయన స్పష్టంచేశారు. సచివాలయంలో సీఎస్ ఆధ్వర్యంలో మెట్రో ప్రాజెక్టు పురోగతిపై శుక్రవారం ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్ బృందం సమీక్ష నిర్వహించింది. పనుల పురోగతిపై ఇక నుంచి ప్రతి మంగళవారం సమీక్ష జరుపుతామన్నారు. మూడు కారిడార్ల పరిధిలో 72 కి.మీ. మార్గానికిగాను 44 కి.మీ. మార్గంలో 1600 పిల్లర్లను ఏర్పాటు చేశామని హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ అధికారులు సీఎస్‌కు తెలిపారు. 33 కి.మీ పరిధిలో పిల్లర్లపై వయాడక్ట్ సెగ్మెంట్లను అమర్చామని చెప్పారు. ఉప్పల్, మియాపూర్ మెట్రో డిపోలు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాయన్నారు. రెండు డిపోల్లో 18 రైళ్లకు సామర్థ్యం, వేగం తదితర అంశాల్లో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మార్చి 21 (ఉగాది) నుంచి నాగోల్ - మెట్టుగూడ (8 కి.మీ.) మార్గంలో తొమ్మిది రైళ్లు నిరంతరాయంగా పరుగులు తీస్తాయని చెప్పారు. ప్రస్తుతం ఈ రూట్లో మెట్రో రైళ్లకు ప్రయోగ పరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు.
మారిన అలైన్‌మెంట్స్‌పై నెలాఖరులోగా లేఖ: అసెంబ్లీ, సుల్తాన్‌బజార్, పాతనగరం ఈ మూడు చోట్ల మెట్రో అలైన్‌మెంట్ మార్పుపై ఈ నెలాఖరులోగా నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీకి అధికారికంగా లేఖ ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. పాతనగరంలో అలైన్‌మెంట్ మార్పుతో 3.2 కి.మీ. మేర మెట్రో మార్గం పెరగనున్న నేపథ్యంలో అందుకయ్యే వ్యయం, ఆస్తుల సేకరణకు అయ్యే వ్యయ అంచనాలను తక్షణం రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ సమావేశంలో హెచ్‌ఎండీఏ కమిషనర్ ప్రదీప్‌చంద్ర, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, ఎల్‌అండ్‌టీ ప్రాజెక్టు డెరైక్టర్ నాయుడు,హైదరాబాద్,సైబరాబాద్ పోలీసు కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
ఆయా విభాగాల అధికారులకు సీఎస్ నిర్దేశించిన పలు లక్ష్యాలివే..
ఎంజీబీఎస్ ప్రాంతంలో మెట్రో ఇంటర్‌చేంజ్ స్టేషన్ (రెండు కారిడార్లు కలిసేచోటు) నిర్మాణానికి సర్వే చేసేందుకు టీఎస్‌ఆర్టీసీ తక్షణం అనుమతించాలి. రంగమహల్ జంక్షన్ నుంచి ఇమ్లీబన్ బస్‌డిపో వరకు నిర్మిస్తున్న రోడ్ బ్రిడ్జీ పనులను జీహెచ్‌ఎంసీ తక్షణం పూర్తిచేయాలి.
చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్, గోపాలపురం పోలీస్‌స్టేషన్, క్వార్టర్స్ ప్రాంగణాల్లో జీహెచ్‌ఎంసీ కేటాయించిన స్థలంలో పార్కింగ్, సర్క్యులేషన్ కోసం హెచ్‌ఎంఆర్ సంస్థ పెద్ద భవంతులను నిర్మించాలి.
గోపాలపురం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను తాత్కాలికంగా జీహెచ్‌ఎంసీ భవంతిలోకి తరలించాలి. తరువాత జీహెచ్‌ఎంసీ కేటాయించిన స్థలంలో పోలీస్‌స్టేషన్‌కు హెచ్‌ఎంఆర్ సొంత నిధులతో పక్కా భవంతిని నిర్మించి ఇవ్వాలి.
మెట్రో ప్రాజెక్టులో ఆస్తులు కోల్పోయిన బాధితులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ తక్షణం పరిహారం అందేలా చూడాలి.