వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనం!
- 231 కరువు మండలాల్లో అమలుకు విద్యాశాఖ నిర్ణయం
- 11,331 పాఠశాలల్లో 9.54 లక్షల మంది విద్యార్థులు
- వంటలు వండేవారున్నా.. పర్యవేక్షించే వారు లేరు
- ప్రత్యామ్నాయాలపై ఆలోచనలు చేస్తున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కరువు మండలాల్లో ఉన్న 11,331 పాఠశాలలకు చెందిన విద్యార్థులకు వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనాన్ని అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఆహార భద్రతలో భాగంగా 231 కరువు మండలాల్లోని పాఠశాలలకు చెందిన 9,54,425 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు కసరత్తు చేస్తోంది.
ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు 42 రోజులపాటు అందించే మధ్యాహ్న భోజనానికి రూ.31.34 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసింది. అయితే వేసవి సెలవుల్లో టీచర్లు స్కూళ్లకు రారు కనుక ఆ సమయంలో మధ్యాహ్న భోజనం అమలు, పర్యవేక్షణ బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న విషయంలో విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. ఇతర ప్రత్యామ్నాయాలపై ఆలోచనలు చేస్తోంది.
ఆహార భద్రత చట్టం నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరికి ఆహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఇందులో భాగంగానే 0-5 ఏళ్ల వయస్సు వారికి సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తుండగా, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. అయితే వేసవి సెలవుల్లో స్కూళ్లు మూతపడనుండడంతో విద్యార్థులకు ఆహారం అందని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా కరువు మండలాల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఆయా మండలాల్లోని విద్యార్థులందరికీ వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
అమలులో అడ్డంకులపై దృష్టి
సెలవుల్లో మధ్యాహ్న భోజనం అమలులో ఎదురయ్యే అడ్డంకులపై విద్యాశాఖ దృష్టిసారించింది. వంటచేసే కార్మికులకు కుకింగ్ చార్జీలు, గౌరవ వేతనాలను వేసవి సెలవుల్లో ఇవ్వడం లేదు. అయితే సెలవుల్లోనూ వేతనాలిస్తామనడంతో వారు వంట చేసి పెట్టేందుకు ఒప్పుకున్నారు. అయితే పర్యవేక్షణ బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్నది తేలడం లేదు. సెలవుల్లో టీచర్లు స్కూలుకు రారు. ఒకవేళ రప్పించినా వారికి ఆర్జిత సెలవులు(ఈఎల్స్) ఇవ్వాల్సి వస్తుంది.
ఇక పర్యవేక్షణ బాధ్యతలను విద్యా వలంటీర్లకు అప్పగించాలనుకున్నా అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. క్లస్టర్ రీసోర్స్ పర్సన్లకు (సీఆర్‌సీ) అప్పజెబుదామంటే వారి సంఖ్య సరిపోదు. గతేడాది వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించిన వలంటీర్లకు బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుం దన్న అంశాన్ని విద్యాశాఖ పరిశీలి స్తోంది. గ్రామ కార్యదర్శులకు లేదా స్థానికంగా ఉండే అంగన్‌వాడీ కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించాలా? అన్న అంశాలను కూడా పరిశీలిస్తోంది. దీని పై వారం పది రోజుల్లో తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.