
మెట్రో స్టేషన్లకు మినీ బస్సులు..
ప్రయాణికుల రద్దీపై అధ్యయన బాధ్యతలు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి
8 నుంచి 16 సీట్ల సామర్థ్యంగల మినీ బస్సులు నడిపే అవకాశం..
స్టేషన్లకు సమీపంలో పార్కింగ్ స్థలాలకు హెచ్‌ఎంఆర్, జీహెచ్‌ఎంసీల అన్వేషణ
సిటీబ్యూరో:నగరంలో వేగంగా రూపుదిద్దుకుంటున్న మెట్రో రైలు నిర్మాణం పూర్తయి, రాకపోకలు ప్రారంభమయితే..ప్రజలకు ఎలాంటి సులభ రవాణా వసతులు కల్పించాలన్న అంశంపై నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా కాలనీల నుండి ప్రయాణికులు మెట్రో స్టేషన్లకు, మెట్రో స్టేషన్ల నుండి ఆయా కాలనీలకు ఎలా వెళ్లాలనే దానిపై అధ్యయనం ప్రారంభించారు. ఈమేరకు స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు మినీ బస్సులు నడిపే అంశంపై ప్రముఖ రవాణా వాహనాల తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థకు అధ్యయన బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది.
స్టేషన్లకు సమీపంలో ఉన్న పెద్ద, చిన్న కాలనీల సంఖ్య, ఉదయం, సాయంత్రం వేళల్లో ఆయా కాలనీల నుంచి బయలుదేరే ప్రయాణికుల వివరాలు, రద్దీ లేని సమయాల్లో మెట్రో స్టేషన్లకు వచ్చే ప్రయాణికుల సంఖ్యపై ఈ సంస్థ అధ్యయనం చేపట్టనుంది. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా 8 నుంచి 16 సీట్ల సామర్థ్యంగల మినీ బస్సులకే అనుమతించే అవకాశాలున్నట్లు తెలిసింది. ఈ బస్సుల రాకపోకలు, నిర్వహణ బాధ్యతల కాంట్రాక్టును సైతం అదే సంస్థకు అప్పజెప్పే అవకాశాలున్నట్లు సమాచారం.
ఇక మెట్రో స్టేషన్లకు ద్విచక్రవాహనాలు, కార్లలో చేరుకునే ప్రయాణికులు తమ వాహనాలను నిలిపేందుకు అవసరమైన పార్కింగ్ స్థలాలను సాధ్యమైనంత త్వరగా అన్వేషించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ,హెచ్‌ఎంఆర్ సంస్థలు రంగంలోకి దిగాయి. అందుబాటులో ఉన్న పార్కింగ్ స్థలాల కోసం అన్వేషిస్తున్నాయి. ఈ కసరత్తు త్వరలో కొలిక్కి రానుంది.
ఇప్పటికే నాగోలు, తార్నాక, గాంధీఆస్పత్రి, గడ్డిఅన్నారం ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉండగా.. మరో 18 చోట్ల పార్కింగ్ స్థలాలను అన్వేషించనున్నట్లు తెలిసింది. ప్రభుత్వ భూములు అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్రైవేటు స్థలాలను సైతం సేకరించాలన్న యోచనలో ఉన్నట్లు తెలిసింది. రద్దీ అధికంగా ఉండే పెద్ద మెట్రో స్టేషన్ల వద్ద విధిగా పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసేందుకు రెండు విభాగాలు కసరత్తు చేస్తున్నాయి. రద్దీ తక్కువగా ఉండే చోట్ల ప్రతి రెండు స్టేషన్లకు ఒక పార్కింగ్ స్థలం కేటాయించనున్నట్లు తెలిసింది.
పాతనగరం అలైన్‌మెంట్‌పై సర్కారు మౌనం..
జేబీఎస్-ఫలక్‌నుమా మార్గంలో మెట్రో మార్గాన్ని మూసీ నది మీదుగా మళ్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీని ఆదేశించిన విషయం విదితమే. నూతన అలైన్‌మెంట్ ప్రకారం 3.2 కి.మీ మేర మెట్రో మార్గం పెరగనుంది. మరోవైపు మూసీ నదిలో పిల్లర్లు వేయడం సాంకేతికంగా కష్టసాధ్యమని, వాణిజ్యపరంగానూ ఈ మార్గంలో పనులు చేపట్టడం సాధ్యపడదని పేర్కొంటూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఇక కోఠి ఉమెన్స్‌కళాశాల, బాటా మీదుగా మళ్లించాల్సిన మెట్రో మార్గంపైనా నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి రెండు ప్రత్యామ్నాయాలు సూచించినట్లు తెలిసింది. ఈ విషయంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మెట్రో పనులు నిలిచాయి.
వడివడిగా పనులు..
ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-శిల్పారామం మార్గాల్లో మెట్రో పనులు ఊపందుకున్నాయి. ఈ మార్గంలో 2017 చివరినాటికి పనులు పూర్తి కానున్నాయి. సర్కారు అనుమతిస్తే మియాపూర్-పంజాగుట్ట మార్గంలో 2016 మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో మెట్రో రైళ్ల రాకపోకలను ప్రారంభించేందుకు ఎల్‌అండ్‌టీ సన్నాహాలు చేస్తోంది. ఇక నాగోల్-సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మార్గంలో ఒలిఫెంటాబ్రిడ్జి,ఆలుగడ్డబావి, మెట్టుగూడా వద్ద మూడు రైల్ ఓవర్‌బ్రిడ్జీలు (ఆర్‌ఓబీలు) నిర్మించాల్సిన అవసరం ఉండడంతో ఈ మార్గంలోనూ మెట్రో రైళ్ల రాకపోకలకు మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది.