సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు కనీస, గరిష్ట చార్జీలను ఎట్టకేలకు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ మెట్రోరైల్ హైదరాబాద్ లిమిటెడ్ ప్రకటించింది. మెట్రో రైలులో కనీస చార్జీ రూ.10.. గరిష్ట చార్జీ రూ.60 ఉంటుందని శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మెట్రోను ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న విషయం విదితమే. అయి తే ఈ నెల 29 నుంచి.. ఉదయం 6 – రాత్రి 10 గంటల వరకు మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. మెట్రో చార్జీలను సెంట్రల్ మెట్రో యాక్ట్ ప్రకారం ఖరారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. నగర మెట్రో కనీస, గరిష్ట చార్జీలు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై మహానగరాలకు దాదాపు సరిసమానంగా ఉండటం గమనార్హం.
తొలిదశ మార్గాల్లో మెట్రో చార్జీలిలా
నాగోల్–అమీర్‌పేట మార్గంలో 17 కి.మీ. మెట్రో రైళ్లలో ప్రయాణిస్తే రూ.45 చెల్లించాల్సి ఉంటుంది. ఇక మియాపూర్–అమీర్‌పేట మార్గంలో 13 కి.మీ.లకు రూ.40 చార్జీ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
29 నుంచి స్మార్ట్‌కార్డులు, టోకెన్ల విక్రయం...
మెట్రో రైళ్లలో టికెట్ల గోల లేకుండా ప్రయాణించేందుకు విడుదల చేసిన నెబ్యులా స్మార్ట్‌కార్డు ధర రూ.100.. దీనికి మరో రూ.100 చెల్లించి రీచార్జీ చేసుకోవాలి. అంటే స్మార్ట్‌కార్డు కొనుగోలుకు మొత్తంగా రూ.200 చెల్లించాలన్నమాట. ఈ స్మార్ట్‌కార్డులను ఈ నెల 29 నుంచి నాగోల్, తార్నాక, ప్రకాశ్‌నగర్, ఎస్.ఆర్.నగర్ మెట్రో స్టేషన్లలో విక్రయిస్తారు. ఎక్కే.. దిగే స్టేషన్ల వద్దనున్న ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ గేట్ల వద్ద ఈ కార్డులను స్వైప్‌చేస్తే ప్రయాణించిన దూరానికి చార్జీ కట్ అవుతుంది. స్మార్ట్‌కార్డుపై ఐదు శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఎల్‌అండ్‌టీ ప్రకటించింది. మెట్రో జర్నీకి వినియోగించే టోకెన్లు సైతం ఈ నెల 29 నుంచి అందుబాటులోకి రానున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment