రేపు కేంద్ర గనుల శాఖ సమావేశంలో టీఎస్‌ఎండీసీ ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న మైనింగ్ బ్లాకులను దక్కించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. ముడి ఇనుము, బాక్సైట్, సున్నపురాయి, బేస్ మెటల్ నిల్వలకు సంబంధించి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా వంద బ్లాక్‌లను గుర్తించింది. ఖనిజాల వెలికితీతలో ఉన్న అనుభవం, సామర్థ్యాన్ని బట్టి వేరే రాష్ట్రాలకు కూడా కేటాయించాలని నిర్ణయించింది. పొరుగు రాష్ట్రా ల్లోని మైనింగ్ బ్లాక్‌లను పొందేందుకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ టీఎస్‌ఎండీసీ సమాయత్తమవుతోంది.
మైనింగ్ బ్లాక్‌ల కేటాయింపులకు సంబంధించి ఈ నెల 12న ఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో కేంద్ర గనుల శాఖ నిర్వహిస్తున్న సమావేశంలో రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు సమర్పించనుంది. టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, సింగరేణి సీఎండీ శ్రీధర్, మైనింగ్ విభాగం అధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. వ్యాపార దృక్పథంతో భవిష్యత్‌లో మైనింగ్ వెలికితీత కార్యకలాపాలపై టీఎస్‌ఎండీసీ దృష్టి సారిస్తుందని సుభాష్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీస్ లిమిటెడ్ ఇతర దేశాల్లోనూ బొగ్గు వెలికితీత కార్యకలాపాలపై దృష్టి సారించింది. గతంలో ఏడు దే శాల నుంచి 13 గనుల నిర్వహణకు సంబంధించి ఆహ్వానం అందింది.