96 శాతం రూ.2వేల నోట్లే: ఈటల
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రానికి వచ్చిన కొత్త కరెన్సీలో 96 శాతం రూ.2000 నోట్లేనని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రదీప్‌చంద్రతో కలిసి ఆర్బీఐ అధికారులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు.
ఆర్బీఐ నుంచి ఇప్పటి వరకు రూ.17,500 కోట్లు వచ్చాయని, లెక్క ప్రకారం రూ.20 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి ఐదువేల కోట్ల చిన్న నోట్లు ఇస్తేనే ప్రస్తుత ఇబ్బందుల నుంచి గట్టెక్కుతామన్నారు. పేదలు డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కొంతమంది దగ్గర వేల కోట్ల కొత్త నోట్లు దొరుకుతుండడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలను కొంతమంది కమీషన్ల పేరుతో మోసం చేస్తున్నారన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. క్యాష్‌లెస్ విధానానికి తెలంగాణ ప్రభుత్వ పూర్తి మద్దతు ఉంటుందంటూ ఆర్బీఐ, కేంద్రం తమకు సహకరించాలని ఈటల కోరారు.