
రైతులకు అన్యాయం జరిగితే ప్రతిపక్షాలదే బాధ్యత
విపక్షాలపై మంత్రి హరీశ్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణను ముంచే పులిచింతలకు మీరు మద్దతు ఇస్తారు. తెలంగాణకు మేలు చేసే మల్లన్నసాగర్‌ను వ్యతిరేకిస్తారా? మీ పాలనలో తెలంగాణ భూము లు ఎలా ఎండిపోయాయో ఇకపై కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నారా’ అని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దగ్గరుండి కట్టించిన పులిచింతల ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో ఒక్క ఎకరానికైనా నీరందిందా అని ప్రశ్నిం చారు. ఉత్తమ్ సొంత నియోజకవర్గంలోనే 17 గ్రామాలను, 14 వేల ఎకరాలను ముంచి 6 వేల కుటుంబాలను వీధులపాలు చేశారన్నారు.
ఏపీకి పారకం..తెలంగాణకు నరకం అన్న రీతిలో సాగిన పులిచింతలపై ఉత్తమ్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. పులిచింతల పాపానికి కాంగ్రెస్ నేతలు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలన్నారు. ఆదివారం హరీశ్ టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. భూ సేకరణ చట్టం-2013 ప్రకారమే మల్లన్నసాగర్ ప్రాజెక్టు అవసరాల కోసం భూసేకరణ చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చట్ట ప్రకారం పరిహారాన్ని కోర్టులో డిపాజిట్ చేసి ప్రాజెక్టు పనులు కొనసాగిస్తామన్నారు. అయితే, ఇందువల్ల రైతులకు నష్టం జరిగితే ప్రతిపక్షాలే పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఎవరైనా రైతులు జీవో 123 ప్రకారం పరి హారం కావాలంటే అలాగే ఇస్తామన్నారు.
ప్రాజెక్టులను అడ్డుకోవడమే వారి లక్ష్యం
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని హరీశ్ అన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రదాయినయిన మల్లన్నసాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు చేయడం బాధాకరమన్నారు. తోటపల్లి ప్రాజెక్టు కింద మూడు గ్రామాలను ముంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ రూపొందించిందని... గ్రామాలను కాపాడడమే కాకుండా అక్కడి రైతులకే చెందిన 36 వందల ఎకరాలతో పాటు మొత్తం 52 వేల ఎకరాలకు నీరు ఇచ్చేలా తమ ప్రభుత్వం కొత్త డిజైన్‌ను రూపొందించిందన్నారు. పాత డిజైన్ ప్రకారమే ప్రాజెక్టును కట్టి మూడు గ్రామాలను ముంచాలని ఉత్తమ్, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో దీక్షలు చేశారన్నారు. అదే ముంపు పేరుతో మల్లన్నసాగర్ కట్టకుండా ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారన్నారు.
రేవంత్ విషం కక్కుతున్నారు...
పోలవరం ముంపు పేరుతో ఖమ్మం జిల్లా నుంచి ఏడు మండలాలను ఏపీలో కలుపుకున్న చంద్రబాబు... ఇక్కడి డీటీపీ నేతల దృష్టిలో గొప్ప నేతగా ఉన్నారని దుయ్యబట్టారు. మల్లన్నసాగర్ వద్ద దీక్షలు చేస్తున్న టీడీపీ నేతలు పోలవరం వద్ద ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వాల డిజైన్ల వల్ల పాలమూరు ప్రాజెక్టుతో 32 గ్రామాలు ముంపునకు గురవుతాయని, కేవలం ఆరు గ్రామాల మీదే ప్రభావం ఉండే విధంగా ముంపును తగ్గించి 12 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా తమ ప్రభుత్వం రీడిజైన్ చేసిందన్నారు. మొత్తం 32 గ్రామాలు మునిగిపోవాల్సిందేనన్నట్టు రేవంత్‌రెడ్డి విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎ.జీవన్‌రెడ్డి, వివేకానంద పాల్గొన్నారు.