అప్రమత్తంగా ఉండండి | Minister Harish Rao orders to the Engineers, officers about rains | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండండి

Published Mon, Aug 21 2017 2:39 AM | Last Updated on Tue, Sep 12 2017 12:36 AM

Minister Harish Rao orders to the Engineers, officers about rains

- చెరువులు తెగకుండా చర్యలు చేపట్టండి: హరీశ్‌
- నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బందికి ఆదేశం
- ముందస్తు చర్యలు చేపట్టాలని సూచన
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సాగునీటి శాఖ ఇంజనీర్లు, అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్‌రావు ఓ ప్రకటనలో ఆదేశించారు. జిల్లాల్లో వర్షాల కారణంగా చెరువులు తెగిపోయే ప్రమాదముందని.. ఆయా జిల్లాల ఇంజనీర్లు వారి హెడ్‌ క్వార్టర్స్‌లోనే ఉండి పరిస్థితిని పరిశీలించాలని సూచించారు. వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా, వాట్సాప్‌ ద్వారా సమీక్షిస్తున్న ఆయన.. నీటిపారుదల విభాగాల సీఈలకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ప్రతి గంటకు వర్షపాతం నమోదు చేయాలని.. వర్షాలకు చెరువులు, తూములు తెగిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు ఆదేశించారు.

సిమెంటు సంచులు, ఇసుక బస్తాలు నిల్వ ఉంచుకోవాలని అన్ని సాగునీటి శాఖ సబ్‌ డివిజన్లకు సూచించారు. ముంపునకు గురయ్యే అవకాశమున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించాలని స్పష్టం చేశారు. చెరువులు, రిజర్వాయర్లలో ఏ మేరకు నీళ్లు చేరాయనేదానిపై జిల్లా అధికారులకు వెంట వెంటనే సమాచారం పంపించాలని ఆదేశించారు. భారీ వర్షాలకు కొన్నిచోట్ల చెరువులు పొంగిపొర్లే అవకాశముందని, ఆయా చెరువుల రక్షణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ పనుల్లో రెవెన్యూ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా.. బాధ్యులను క్షమించబోమని హెచ్చరించారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే జిల్లా కలెక్టర్లకు, రెవెన్యూ ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement