‘ఔటర్’ దాహార్తి తీర్చే బాధ్యత జలమండలిదే
- నూతనంగా నీళ్లిచ్చే ప్రాంతాలపై మ్యాప్ రూపొందించాలి: కేటీఆర్
- జూన్‌లోగా శివార్లలో పైప్‌లైన్, రిజర్వాయర్ పనులు పూర్తిచేయాలి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరం సహా ఔటర్ రింగ్‌రోడ్డుకు లోపలున్న 190 గ్రామాలు, నగర పంచాయతీల దాహార్తిని తీర్చే బాధ్యత జలమండలి దేనని మున్సిపల్ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గ్రేటర్ శివార్లలో రూ. 1,900 కోట్ల హడ్కో నిధులతో చేపట్టిన తాగునీటి పథకం పనుల ద్వారా కొత్తగా నీళ్లిచ్చే ప్రాంతాలు, బస్తీలపై సమగ్ర చిత్రపటం (మ్యాప్) రూపొందించాలన్నారు. బేగంపేట్‌లోని హెచ్‌ఎంఆర్ కార్యాలయంలో మంగళవారం మంత్రి మహేందర్‌రెడ్డి, శివారు ప్రాంతాల ఎమ్మెల్యేలు, జలమండలి అధికారులతో ఆయన సమావేశమై హడ్కో పథకంపై సమీక్షించారు.
నీటి ఎద్దడి ప్రాంతాలకు ట్యాంకర్లు పంపాలి
నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో పైప్‌లైన్ల కోసం తవ్వుతున్న సీసీ, బీటీ రోడ్లకు పనులు పూర్తయిన వెంటనే మర మ్మతులు చేపట్టాలన్నారు. వీటిని జూన్‌లోగా పునరుద్ధరించాలన్నా రు. రహదారులు తవ్విన చోట వైట్ టాపింగ్‌రోడ్లను వేయాలన్నారు. పైప్‌లైన్ పనుల్లో ప్రమాదం జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుం టానని మంత్రి హెచ్చరించారు.
రాజేంద్రనగర్ పనుల ఆలస్యంపై ఆగ్రహం
రాజేంద్రనగర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో 2008–10 మధ్యకాలంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద చేపట్టిన పనుల్లో తీవ్ర జాప్యం జరగడంపై పనులు చేపట్టిన సంస్థలు, సంబంధిత అధికారులపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకం జాప్యం అవడానికి గల కారణాలపై విచారణ చేపట్టాలని జలమండలి ఎండీ దానకిశోర్‌కు సూచించారు.
‘యాన్యుటీ’లో ఔటర్ తాగునీటి పథకం?
ఔటర్ రింగ్‌రోడ్డుకు లోపలున్న 190 గ్రామాలు, నగర పంచాయతీల దాహార్తిని తీర్చేందుకు జలమండలి రూ. 628 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ పథకాన్ని పూర్తిగా ప్రైవేటు నిధులతో (యాన్యుటీ) చేపట్టాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకోసం త్వరలో టెండర్లు పిలవనున్నట్లు తెలిసింది.