
‘ఐసీయూ’ సెటప్‌పై మంత్రి సీరియస్
వైద్య ఆరోగ్యశాఖ అధికారుల తీరుపై ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. ముందస్తు ఏర్పాట్లు చేయకుండానే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల (ఐసీయూ)ను తాత్కాలిక పద్ధతిలో నెలకొల్పి అభాసుపాలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖ అధికారుల తీరుపై ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. ముందస్తు ఏర్పాట్లు చేయకుండానే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల (ఐసీయూ)ను తాత్కాలిక పద్ధతిలో నెలకొల్పి అభాసుపాలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పుట్టిన రోజున మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రిలో తాత్కాలికంగా ఐసీయూ ఏర్పాటు చేసి వెంటనే ఎత్తేయడంపై దుమారం రేగడం, ‘ఐసీయూ సెటప్.. అంతా బిల్డప్’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో కథనం రావడంతో మంత్రి చర్యలు చేపట్టారు.
మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను తొలగించి మరొకరికి బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ‘‘ఐసీయూ ఏర్పాట్లు చేశాం. వాటిని నిర్వహించాల్సిన బాధ్యత ఆసుపత్రి అధికారులది. సమాచార లోపం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. అధికారుల వైఫల్యం ఉంది. ఇక నుంచి అలా జరగదు..’’ అని ఆయన ‘సాక్షి’తో అన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుం టాం’’ అని హెచ్చరించారు. మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో శాశ్వత ప్రాతిపదికన ఐసీయూ యూనిట్ ఏర్పాటు చే శామన్నారు. ఐసీయూల నిర్వహణపై హైదరాబాద్ నుంచే పర్యవేక్షణ జరిగేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశం
ఐసీయూ ఒక్కో యూనిట్ కోసం రూ. కోటి వరకు ఖర్చు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. దీనికి టెండర్లూ పిలిచా రు. టెండర్లు ఖరారు కాకున్నా అధికారులు మాత్రం హడావుడి తంతుకు తెరలేపారు. ఈ విషయాలేవీ మంత్రి లక్ష్మారెడ్డి దృష్టికి రాలేదని తెలిసింది. మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రిలో ఐసీయూను ఆర్భాటంగా ఏర్పాటు చేశారు. అవి డెమో ఐసీయూ పరికరాలు కావడంతో కంపెనీ వాళ్లు ప్రారంభం అయిన వెంటనే తీసుకొని వెళ్లారు. ఇందులో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారుల పాత్రపై మంత్రి విచారణకు ఆదేశించారు. ఈ నెల 25న సిద్దిపేట ఏరియా ఆసుపత్రి, కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో ఐసీయూలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించినట్లు తెలిసింది.