
భగ్గుమన్న మిర్చి రైతులు
గిట్టుబాటు ధర కోరుతూ జాతీయ రహదారి దిగ్బంధం
హైదరాబాద్: మిర్చికి గిట్టుబాటు ధర లేదని మలక్‌పేటలోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. మార్కెట్ కార్యాలయం ముందు ఆందోళనతోపాటు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా జరిపారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయి చాదర్‌ఘాట్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి.విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు.. రైతుల వద్దకు వచ్చి వారిని మార్కెట్ కార్యాలయానికి పిలిపించి చర్చలు జరిపారు.
అనంతరం రైతులు విలేకరులతో మాట్లాడుతూ.. గత ఏడాది ఇదే సమయంలో క్వింటాకు రూ.8 నుంచి 12 వేల వరకు ధర పలికిందని, ఇప్పుడు రూ. 500 నుంచి రూ. వెయ్యికి దిగిపోయిందన్నారు. వ్యాపారులు తమను నిలువునా దోచుకుంటూ ఇబ్బందులు పెడుతుంటే మార్కెట్ పాలకులు చోద్యం చూస్తుండటం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉల్లి సరుకును ప్రభుత్వం ఎలా కొనుగోలు చేసిందో మిర్చిని కూడా కొనుగోలు చేసి న్యాయం చేయాలని, క్వింటాకు రూ.1,500 చొప్పున ప్రభుత్వమే చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
గిట్టుబాటు ధర లభించేలా చర్యలు..
మిర్చి ధరను దృష్టిలో పెట్టుకుని గురువారం, శుక్రవారం రెండు రోజులూ మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్‌జీఎస్ మల్లేశం తెలిపారు. వ్యాపారులతో మాట్లాడి సమస్య రాకుండా చూస్తామని, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.