
సాక్షి, హైదరాబాద్
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) కోసం హైదరాబాద్ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ కోసమో, మరెవరి కోసమో తాము అభివృద్ధి పనులు చేయడం లేదని, నగర ప్రజల కోసమే ఈ పనులు చేపడుతున్నామని రాష్ట్ర మున్సిపల్, ఐటీ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా విశ్వనగరం కోసం రూపొందించిన వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్సార్‌డీపీ)లో పలు పనులు ఈ ఏడాది ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఇది పనుల అమలు సంవత్సరమని, జవాబుదారీతనంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. మిషన్ హైదరాబాద్ పేరుతో రానున్న ఏడేళ్ల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మాదాపూర్‌లోని అయ్యప్పసొసైటీలో రూ.44.30 కోట్లతో నిర్మించిన అండర్ పాస్‌ను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రవాణామంత్రి పి.మహేందర్‌రెడ్డి తదితరులతో కలసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మొత్తం రూ.23 వేల కోట్లతో 4 దశల్లో ఎస్సార్‌డీపీ పనులకు ప్రణాళిక రూపొందించగా ప్రస్తుతం 19 ప్రాంతాల్లో రూ.3,200 కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. మరో రూ.3 వేల కోట్ల పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు.
111 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ పనులు..
నగరంలో 111 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించామని, ఇందులో మూడు స్కైవేలు నిర్మించాలని తలపెట్టామన్నారు. వీటిల్లో రూ.వెయ్యి కోట్లతో ఉప్పల్–నారపల్లి స్కైవే పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. మరో రెండింటికి అవసరమైన భూముల కోసం రక్షణ శాఖ అనుమతి కోసం వేచి చూస్తున్నామన్నారు. అనుమతి రాగానే జూబ్లీ బస్టాండ్ నుంచి తిరుమలగిరి రాజీవ్ రహదారి వరకు ఒక స్కైవే, ప్యాట్నీ నుంచి బోయిన్‌పల్లి వరకు మరో స్కైవే నిర్మాణం చేపడతామన్నారు. జాతీయ రహదారుల సంస్థతో కలసి పీవీ ఎక్స్‌ప్రెస్‌వేను పొడిగించాలని ప్రతిపాదించామని చెప్పారు. ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు రూ.426 కోట్లతో స్టీల్ ఫ్లై ఓవర్ నిర్మించనున్నట్లు తెలిపారు. రేతిబౌలి నుంచి నానల్‌నగర్ వరకు రూ.175 కోట్లతో, అంబర్‌పేట్ వద్ద రూ.270 కోట్లతో చేపట్టిన ఫ్లైఓవర్ పనులు 2019 డిసెంబర్‌లోగా పూర్తి చేస్తామన్నారు. శిల్పారామం సౌందర్యం దెబ్బతినకుండా అక్కడ మరో ఫ్లైఓవర్‌ను నిర్మిస్తామని, రూ.2,225 కోట్ల విలువైన దీనికి టెండర్లు కూడా పూర్తయ్యాయన్నారు.
మెరుగైన నగరం.. ఓడీఎఫ్ సిటీ..
కేంద్ర ప్రభుత్వం, మెర్సర్ సంస్థల సర్వేల్లో దేశంలోనే అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా హైదరాబాద్ మూడేళ్లు వరుసగా అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. స్వచ్ఛభారత్ మిషన్.. హైదరాబాద్‌ను బహిరంగ మల విసర్జన రహిత(ఓడీఎఫ్) సిటీగా ప్రకటించినందుకు జీహెచ్‌ఎంసీలోని పారిశుధ్య కార్మికుల నుంచి అధికారుల వరకు అందరికీ అభినందనలు తెలిపారు. నగర రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు, మెరుగులు దిద్దే చర్యలు చేపట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు. రెండు దశల్లో రూ.950 కోట్లతో రోడ్లను అభివృద్ధి పరిచేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, అధునాతన సాంకేతికతను వినియోగించుకుని వర్షానికి దెబ్బతినని విధంగా రోడ్లు నిర్మిస్తామన్నారు. దేశంలో ఏ మెట్రో నగరంలో లేనివిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపల్ బాండ్లు జారీ చేయనున్నామని చెప్పారు. ఏడాదిలో పూర్తి కావాల్సిన అండర్‌పాస్‌ను 9 నెలల్లోనే పూర్తిచేయడంతో జీహెచ్‌ఎంసీ చీఫ్ ఇంజనీర్ శ్రీధర్‌తోపాటు ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్లు, అధికారులను కేటీఆర్, నాయిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అండర్‌పాస్‌తో సమయం ఆదా..
అయ్యప్ప సొసైటీ అండర్‌పాస్‌తో కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ వైపు నుంచి బంజారాహిల్స్ సహ కోర్ సిటీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి ఎంతో సమయం ఆదా అవుతుంది. ట్రాఫిక్ వల్ల ప్రస్తుతం 15 నిమిషాల నుంచి అరగంట పడుతుండగా.. అండర్‌పాస్‌తో రెండు నిమిషాల్లో వెళ్లవచ్చు. పది మీటర్ల వెడల్పు ఉన్న రెండు లేన్ల ఈ అండర్ పాస్ క్యారేజ్ వే 7 మీటర్లు.
ఇది పనుల అమలు సంవత్సరం..
నగరంలో ఏ పని ఎప్పుడు పూర్తవుతుందో మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఆ పని, పూర్తయ్యే సమయం ఇలా..
ఎస్సార్‌డీపీలో భాగంగా చేపట్టిన పలు ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, స్కైవేలు, జంక్షన్ల అభివృద్ధి తదితర పనులు ఇవీ..
54 జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు
111 కి.మీ. మేర స్కైవేలు
166 కి.మీ. మేజర్ కారిడార్ అభివృద్ధి పనులు
348 కి.మీ. మేజర్ రోడ్ అభివృద్ధి పనులు
Comments
Please login to add a commentAdd a comment