యాదాద్రికి ఎంఎంటీఎస్!
చర్లపల్లి వద్ద భారీ టెర్మినల్
ప్రతిపాదనలు రూపొందిస్తున్న రైల్వేశాఖ
రానున్న బడ్జెట్‌లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు
రాష్ర్ట ప్రతిపాదనలపై కేంద్రం సుముఖత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి వరకు ఉద్దేశించిన ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టును భువనగిరి నుంచి రాయగిరి వరకు పొడిగించేందుకు రైల్వేశాఖ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. అలాగే చర్లపల్లిలో అతిపెద్ద ప్రయాణికుల టెర్మినల్‌ను నిర్మించాలని భావిస్తోంది.
ఈ నెలలో ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌లోనే ఈ రెండు ప్రాజెక్టులను చేర్చడంతో పాటు, నిధులను కేటాయించేందుకు సన్నాహాలు చేపట్టింది. హైదరాబాద్ నుంచి యాదాద్రికి వెళ్లే భక్తుల కోసం ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టును రాయగిరి వరకు పొడిగించాలని కోరుతూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో రైల్వేశాఖ ఈ చర్యలు చేపడుతోంది.
ప్రస్తుతం సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్‌లపై ఒత్తిడి పెరిగినందున చర్లపల్లి, వట్టినాగులపల్లి వద్ద మరో రెండు టెర్మినళ్లు నిర్మించాలన్న ప్రతిపాదనను కూడా రైల్వేశాఖ ఆమోదించనుంది. అయితే మొదట చర్లపల్లి టెర్మినల్ నిర్మాణానికి మాత్రం ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్‌పై ప్రయాణికుల ఒత్తిడి తగ్గనుంది.
ఎంఎంటీఎస్ పొడిగింపుతోపాటు రైల్వే టెర్మినళ్ల నిర్మాణానికి మౌలిక సదుపాయాలు కల్పించడం, రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా అందజేసేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ ఈ రెండు ప్రాజెక్టులను సీరియస్‌గా పరిశీలిస్తోంది. ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఈ ప్రాజెక్టులపై చర్చించారు.
తొలగనున్న అడ్డంకులు
పటాన్‌చెరు, ఘట్‌కేసర్, ఉందానగర్, శంషాబాద్ వంటి నగర శివార్లను కలుపుతూ మొత్తం 6 మార్గాల్లో రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగనుంది. రాయగిరి వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డంకులు తొలిగిపోయే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. మౌలాలీ నుంచి సనత్‌నగర్ మధ్యలోని డిఫెన్స్ ఏరియాలో 5 కిలోమీటర్ల మేర పనులు నిలిచిపోయాయి.
అలాగే నగరంలో మరో 50 చోట్ల జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి లభించాల్సి ఉంది. ప్రస్తుతం రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నందున రైల్వేలై న్ల నిర్మాణానికి ఆటంకాలు తొలగిపోనున్నాయి. మౌలాలి-ఘట్‌కేసర్, మౌలాలి-సనత్‌నగర్, సనత్‌నగర్-పటాన్‌చెరు, తెల్లాపూర్-పటాన్‌చెరు, ఫలక్‌నుమా-ఉందానగర్ , ఉందానగర్-శంషాబాద్ విమానాశ్రయం వరకు ఆరు మార్గాల్లో రూ.850 కోట్లతో రెండో దశ ను ప్రారంభించారు. ఉందానగర్-శంషాబాద్ మార్గంలో తప్ప మిగతా అన్ని మార్గాల్లో పనులు జరుగుతున్నాయి. కొత్తలైన్లు, డబ్లింగ్, విద్యుదీకరణ, కొత్త స్టేషన్‌ల నిర్మాణం తదితర పనుల వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు నిధులను అందజేస్తుంది.
శివార్లలోనే నిలిచిపోతున్న రైళ్లు
సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజు ఎక్స్‌ప్రెస్‌లు, ప్యాసింజర్‌లు, ఎంఎంటీఎస్ రైళ్లు అన్నీ కలిపి సుమారు 200 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. రద్దీ అధికంగా ఉండే రోజుల్లో 2.5 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. సికింద్రాబాద్ స్టేషన్‌పై పెరిగిన ఒత్తిడి దృష్ట్యా చాలా రైళ్లు నగర శివార్లలోనే నిలిచిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే చర్లపల్లి, వట్టినాగులపల్లిలో టెర్మినల్స్ నిర్మించాలని రైల్వేశాఖ ప్రతిపాదించింది. దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్‌గా రవీంద్ర గుప్తా బాధ్యతలు చేపట్టిన మొదట్లోనే చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను పరిశీలించి రైల్వేబోర్డుకు ప్రతిపాదనలు అందజేశారు.