మోడల్ స్కూళ్లలో సీట్లు పెంపు
- ఆరు నుంచి పదో తరగతి వరకు 80 నుంచి 100 సీట్లకు...
- ఇంటర్మీడియెట్‌లో 80 నుంచి 160కి పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఆరు నుంచి 12వ తరగతి వరకు ఇప్పటివరకు ఉన్న సీట్ల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రస్తుతమున్న 80 సీట్ల నుంచి 100కి పెంచింది. ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 80 నుంచి 160 సీట్లకు పెంచింది. సెకండియెర్ మినహా మిగతా తరగతుల్లో ఈ సీట్లు ఈ విద్యాసంవత్సరం నుంచే అందుబాటులో ఉంటాయి. ప్రవేశ మార్గదర్శకాలకు సంబంధించి శుక్రవారం విద్యాశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రంజీవ్.ఆర్.ఆచార్య జీవో 24 జారీ చేశారు.
మార్గదర్శకాల్లోని ప్రధానాంశాలివీ..
► 6 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలను ప్రవేశపరీక్ష ద్వారా చేపట్టాలి. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాలు చేపట్టాలి. ఎంపిక జాబితాతోపాటు 20 శాతం మందితో వెయిటింగ్ లిస్టు రూపొందించాలి. వెయిటింగ్ లిస్టువారికి కేటాయించిన తర్వాత సీట్లు మిగిలితే పక్క మండలాలవారికి కేటాయించాలి. అయితే వీటికి రాష్ట్రస్థాయిలో అనుమతి తీసుకోవాలి.
► ప్రతి తరగతిలో ఇదివరకు రెండు సెక్షన్లు, ప్రతి సెక్షన్‌లో 40 చొప్పున 80 సీట్లు ఉం డగా, ఇప్పుడు ప్రతి సెక్షన్‌లో 50 చొప్పున 100 సీట్లు అందుబాటులోకి వస్తాయి.
► ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ఇదివరకు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీలో 20 చొప్పున 80 సీట్లు ఉండగా, వాటిని ప్రతి గ్రూపులో 40 చొప్పున 160 సీట్లు పెంచింది. ద్వితీయ సంవత్సరంలోనూ ప్రతి గ్రూపులో 40 చొప్పున 160 సీట్లు అందుబాటులోకి వస్తాయి. సెకండియర్‌లో పెంచిన సీట్లు 2017 (జూన్) నుంచి అమల్లోకి వస్తాయి.
►ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం (బీసీ-ఏ 7 శాతం, బీ 10 శాతం, సీ 1 శాతం, డీ 7 శాతం, ఈ 4 శాతం) సీట్లు కేటాయించాలి. వికలాంగులకు 3 శాతం, మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వాలి.
► మోడల్ స్కూల్లో పదో తరగతి పూర్తి చేసుకున్నవారికి అదే మోడల్ స్కూల్లో ఇంటర్మీయెట్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు అవకాశం కల్పించాలి.
► మోడల్ స్కూళ్లలో పనిచేసే ఉద్యోగుల పిల్లలకు ప్రతి స్కూల్లో మంజూరైన సీట్లకు అదనంగా 10 మందికి మించకుండా 2 శాతం సీట్లను కేటాయించే అధికారం మోడల్ స్కూల్స్ ఎక్స్ అఫిషియో ప్రాజెక్టు డెరైక్టర్‌కు ఉంటుంది.