మోడల్ స్కూళ్లు
కర్నూలు(విద్య): కేంద్రీయ విద్యాలయాల తరహాలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన మోడల్ స్కూళ్లలో(ఆదర్శ పాఠశాలలు) నిర్లక్ష్యం గూడుకట్టుకుంది. ఈ పాఠశాలలు మంజూరై నాలుగేళ్లయినా.. పనుల ప్రారంభానికే రెండేళ్లు పట్టింది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో భవనాలు పూర్తి కాకపోవడంతో హాస్టల్ వసతి ఎండమావిగా మారింది. జిల్లాలోని 51 మండలాల్లో ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కోదానికి రూ.3.02కోట్లను మంజూరు చేసింది. వీటిని ఆయా మండల కేంద్రాల్లో నిర్మించేందుకు నాలుగేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపారు.
ఒక్కో పాఠశాలను నాలుగు నుంచి ఐదు ఎకరాల స్థలంలో అన్ని రకాల వసతులు, సౌకర్యాలతో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. డే స్కాలర్, రెసిడెన్సియల్ విధానంలో పాఠశాలలను నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రతి పాఠశాలకు ఒక ప్రిన్సిపాల్, తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టులకు ఇద్దరేసి పీజీటీలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టులకు ఒక్కో పీజీటీలను నియమించారు. మొదటి యేడాది పాఠశాలలు ప్రారంభమైన ఆరు నెలలకు సబ్జెక్టుకు ఒకరు చొప్పున టీజీటీలను నియమించారు.
వీరితో పాటు అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో ఫిజికల్ డెరైక్టర్, యోగా టీచర్, ఆర్ట్ టీచర్, ఎస్‌యూపీడబ్ల్యు టీచర్, కంప్యూటర్ టీచర్, లైబ్రేరియన్, క్లర్ కమ్, అకౌంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్‌మెన్ పోస్టులను కేటాయించారు. వీటిని అప్పటి ఎమ్మెల్యేల పేరు చెప్పుకుని కొందరు అమ్ముకున్నారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఒక్కో పోస్టుకు రూ.50వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలిసింది.
జిల్లాకు మంజూరైన 51 పాఠశాలలకు స్థలసేకరణ సమస్యగా మారడంతో 36 పాఠశాలలకు మాత్రమే అధికారులు స్థలాన్ని చూపించగలిగారు. దీంతో వీటికి మొదటి విడతగా రూ.108.72కోట్లు మంజూరయ్యాయి. 2013లో 36 భవనాలు పూర్తి కావడంతో పాఠశాలలను హడావుడిగా ప్రారంభించారు. మొదటి సంవత్సరం 6 నుంచి 9వ తరగతితో పాటు ఇంటర్‌మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు నిర్వహించారు. ప్రతి తరగతికి 80 మంది చొప్పున అడ్మిషన్లను లాటరీ పద్ధతిలో నిర్వహించారు. ఈ యేడాది భవనాల నిర్మాణం పూర్తి కాకపోవడం, హాస్టల్ వార్డెన్, ఇతర సిబ్బంది నియామకం చేపట్టకపోవడంతో హాస్టళ్లను ప్రారంభించలేకపోయారు. ఫలితంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం.