
మొక్కలకన్నా.. ప్రచారమే ఎక్కువ: షబ్బీర్
హైదరాబాద్: ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమ అమలులో ఎన్నో లోపాలున్నాయని విపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. శుక్రవారం శాసన మండలిలో హరితహారంపై చర్చ సందర్భంగా ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. మూడేళ్లుగా సరైన ప్రణాళిక లేకుండా హరితహారం పేరిట రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు.
నాటిన మొక్కలకు అయిన ఖర్చు కన్నా.. ప్రచార ఆర్భాటాలకే ఎక్కువ ఖర్చు చేసి ప్రజా ధనాన్ని వృథా చేశారని దుయ్యబట్టారు. నాటిన మొక్కలకు నీరు పోసే వాళ్లు లేక మొక్కలు అన్నీ చచ్చిపోతున్నాయని షబ్బీర్ అలీ చెప్పారు.