
షబ్బీర్ వ్యాఖ్యలపై మండిపడ్డ కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో బుధవారం రైతు రుణమాఫీపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. సోనియా భిక్ష వల్లే తెలంగాణ వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కేటీఆర్.. తెలంగాణ కాంగ్రెస్ భిక్ష కాదని, ప్రజలంతా పోరాడితేనే రాష్ట్రం వచ్చిందని స్పష్టం చేశారు.
గతంలో కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా ఒకేసారి రుణమాఫి చేసిందన‍్న షబ్బీర్ అలీ.. తెలంగాణ ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో 2,600 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. ప్రభుత్వం 700 మంది చనిపోయారని చెప్పి వారిలో 349 కుటుంబాలకు మాత్రమే పరిహారం చెల్లించిందన్నారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. గత ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 1.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తే.. తమ ప్రభుత్వం 6 లక్షలకు పెంచిందని అన్నారు. రైతులు, తెలంగాణ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదని కేటీఆర్ విమర్శించారు.