
అప్పుల తెలంగాణగా మార్చొద్దు: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పిన ప్రభుత్వం.. అప్పుల తెలంగాణ దిశగా తీసుకెళుతోందని శాసన మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. 2016-17 వార్షిక బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు వంటి ప్రాజెక్టుల కోసం బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. భగీరథ కోసం రూ.40 వేల కోట్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం రూ.15 వేల కోట్లు, విద్యుత్ ప్రాజె క్టుల కోసం రూ.91 వేల కోట్లు.. ఇలా మొత్తం కలిపి రూ.1.46 లక్షల కోట్ల అప్పు తెస్తామని ప్రభుత్వం చెప్పడం చూస్తుంటే.. రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ మార్చడం ఖాయమనిపిస్తోందని దుయ్యబట్టారు.
ఎఫ్‌ఆర్‌బీఎం ప్రకారం ఇంత అప్పు తెచ్చేందుకు కేంద్రం అనుమతించనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా అప్పులకు పోవాలనుకోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఎలాగోలా అప్పులు తెచ్చి ప్రాజెక్టులు పూర్తిచేశాక, తెచ్చిన అప్పులను తిరిగి ఎలా చెల్లిస్తారో ప్రభుత్వం చెప్పడం లేదన్నారు. డబుల్ బెడ్‌రూం పథకం గానీ, మిషన్ భగీరథ పథకం ద్వారా గానీ ఎటువంటి (పన్నులు వేయకుండా) రెవెన్యూ వెనక్కి వచ్చే పరిస్థితి లేనందున అప్పులు తీర్చడం ఎలా సాధ్యమని షబ్బీర్ ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి ఈటల ప్రవేశపెట్టిన రూ.1.30 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ వాస్తవదూరంగా ఉందన్నారు.