- మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ప్రశ్న
- కేజీ టు పీజీపై ప్రభుత్వాన్ని నిలదీసిన బీజేపీ
- క్రమబద్ధీకరణ ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో తెలపాలని మజ్లిస్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమని చెబుతున్న పథకాలకు మీదగ్గర డబ్బులేనపుడు ఆయా పథకాలకు పరిపాలన మంజూరెలా ఇస్తారని తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. బుధవారం ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథకు గానీ, డబుల్‌బెడ్రూం పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించకుండా, కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రుణాలు తెస్తామని ప్రభుత్వం చెబుతోంద న్నారు. అయితే.. ఎటువంటి రెవెన్యూ రాని పథకాల కోసం తెచ్చే రూ.79వేలకోట్ల రుణాన్ని తిరిగి ఎలా చెల్లిస్తారో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
గత రెండు బడ్జెట్లలోనూ అంచనాలకు, వ్యయానికి ఎంతో వ్యత్యాసం ఉందని, తాజా బడ్జెట్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుందన్న షబ్బీర్.. హౌసింగ్ కోసం రుణమిస్తానంటున్న హడ్కో సంస్థ 2014-15లో దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.21వేలకోట్లు ఇస్తామని చెప్పి తీరా విడుదల చేసింది రూ.8వేలకోట్లేనన్న సంగతిని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెప్పిన విధంగా ఈ ఏడాది 2.60లక్షల డబుల్‌బెడ్రూం ఇళ్లు కట్టే పరిస్థితి కనిపించడం లేదన్నారు. 7గంటల ఉచిత విద్యుత్ కోసం రూ.4వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం, 9గంటల ఇస్తామని చేసిన ప్రకటన మేరకు ఎందుకు కేటాయింపులు చేయలేదని ప్రశ్నించారు.
ప్రజలపై ఎటువంటి పన్నుల భారం మోపమని మేనిఫెస్టోలో చెప్పి, తాజాగా విద్యుత్ చార్జీల రూపంలో రూ.2వేలకోట్లు, ఎఫ్‌ఎస్‌ఏల రూపంలో మరో రూ.3వేలకోట్లు భారాన్ని ప్రభుత్వం వేస్తోందన్నారు. ఏదైనా ప్రాజెక్ట్‌లో రూ.4వేలకోట్లు తగ్గించుకొని రుణమాఫీకి కేటాయిస్తే, రాష్ట్రంలోని రైతులందరూ రుణవిముక్తులవుతారని, రైతుల కోసం చేసిన సూచనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. జనాభాలో 70శాతం ఉన్న రైతాంగానికి సబ్సిడీలు మరింత పెంచాలని, విద్య, ఆరోగ్యం, సంక్షేమ రంగాలకు అదన ంగా నిధులు కేటాయించాలని సూచించారు.
ఆచరణాత్మకంగా ఉండాలి..
బడ్జెటోల నిధుల కేటాయించకుండా, బయటి నుంచి రాబడి లేకుండా 2.60లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు క డతామని ప్రభుత్వం చేసిన ప్రకటనలో ప్రజలకు ఎన్నో ఆనుమాలున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు అన్నారు సంక్షేమ పథకాలు ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణాత్మకంగా ఉండాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కేజీటుపీజీ ప్రోగ్రామ్‌కు గతేడాది కేటాయించిన నిధుల్లో సగానికి సగం నిధులు కూడా ఖర్చు చేయకపోవడమే సర్కారు చిత్తశుద్ధిని తెలుపుతోందన్నారు. నాన్‌ప్లాన్‌లో పెట్టిన రూ.1036కోట్లతో విద్యారంగాన్ని ఎలా తీర్చిదిద్దగలరని ప్రశ్నించారు.
మజ్లీస్ ఎమ్మెల్సీ రిజ్వీ మాట్లాడుతూ..ప్రభుత్వం బడ్జెట్లో చూపిన అంకెలు వాస్తవానికి దూరంగా ఉన్నాయన్నారు. భూముల క్రమబద్దీకరణ విషయమై జీవో 59 కింద ఎన్ని దరఖాస్తులకు ఆమోదం తెలిపారు, ఎన్నింటినీ తిరస్కరించారు, ఎంత రాబడి వచ్చిందో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. వక్ఫ్ ట్రిబ్యునల్‌కు పూర్తిస్థాయి జడ్జిని నియమించాలని, హైదరాబాద్‌లో తాగునీటి అవసరాల కోసం సమ్మర్ యాక్షన్ ప్లాన్ నిధులను రూ.40కోట్ల నుంచి రూ.100కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. మైనార్టీలకు వివిధ పథకాల కింద రూ.1204కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఇంకా ఈ చర్చలో పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, యాదవరెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, నారదాసు లక్ష్మణరావు పాల్గొన్నారు.