
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారానికి వాయిదా పడ్డాయి. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు బిల్లు సహా మొత్తం 8 బిల్లులను ఆమోదించింది. గురువారం అసెంబ్లీలో టీఎస్ ఐపాస్, శాసనమండలిలో వ్యవసాయ రంగంపై చర్చ జరుగనుంది.
బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ రూ.16,500 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలను కూడా చెల్లించామన్నారు. సోనియా గాంధీ భిక్ష వల్లే తెలంగాణ వచ్చిందంటూ శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ భిక్ష కాదని, ప్రజలంతా పోరాడితేనే రాష్ట్రం వచ్చిందని కేటీఆర్ అన్నారు.
అసెంబ్లీలో బుధవారం ఆమోదించిన బిల్లుల వివరాలు
1.తెలంగాణ జీతాలు,పింఛను చెల్లింపు-తొలగింపు బిల్లు
2.తెలంగాణ జిల్లాల ఏర్పాటు, సవరణ బిల్లు
3.కరీంనగర్ మహానగర ప్రాంత పోలీస్ బిల్లు
4.నిజామాబాద్ మహానగర ప్రాంత పోలీస్ బిల్లు
5.రామగుండం మహానగర ప్రాంత పోలీస్ బిల్లు
6.సిద్ధిపేట మహానగర ప్రాంత పోలీస్ బిల్లు
7.తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాసనాల సవరణ బిల్లు
8.శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం సవరణ బిల్లు.