గులాబీ కండువా కప్పుకోని గుత్తా
- అనర్హత ముప్పు తప్పించుకోవడానికా?
- సీఎంకు ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేనందునా?
-
రాజకీయ వర్గాల్లో చర్చ
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇంతా చేస్తే.. గులాబీ కండువా కప్పుకోనే లేదు! టీఆర్‌ఎస్‌లో చేరిక సందర్భంగా నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మిర్యాలగూడ, దేవరకొండ, నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఆయన పెద్దఎత్తున తన అనుచరులను తరలించారు. కాంగ్రెస్‌కు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను టీఆర్‌ఎస్‌లోకి తీసుకువచ్చారు. కానీ సీఎం కేసీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పకపోవడం.. తన ప్రసంగంలో ఒక్కసారి మినహా గుత్తా పేరును పెద్దగా ప్రస్తావించకపోవడంపై చర్చ జరుగుతోంది. ఇది ఒకింత గందరగోళానికి దారి తీసింది.
అయితే ఎంపీ గులాబీ కండువా కప్పుకోకపోవడం వెనుక రాజకీయ కోణం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. గుత్తా టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్న తర్వాత సీఎం కేసీఆర్‌తో జరిగిన తొలి భేటీలోనే తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి వస్తానని చెప్పారు. కానీ సీఎం అందుకు ససేమిరా అన్నట్టు తెలిసింది. రాజీనామా చేయకుండా పార్టీ మారితే.. తనపై అనర్హత వేటు పడే ముప్పు ఉందన్న సందేహాన్ని గుత్తా సీఎం వద్ద ప్రస్తావించారు. గుత్తా ఎంపీ పదవికి రాజీనామా చేస్తే .. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలకు పోలేమన్న చర్చ పార్టీ సీనియర్ నేతల్లో జరిగినట్లు చెబుతున్నారు. ‘‘ఉప ఎన్నికలకు కొంత సమయం తీసుకుందాం.. ప్రతీసారి ఎన్నికలంటే ప్రజల్లో వ్యతిరేకత రావొచ్చు. ప్రాజెక్టులపై దృష్టి పెట్టాల్సి ఉంది. వర్షాలు పడి కరువు తీరాక... ప్రజలు సంతోషంగా ఉన్న సమయంలో ఎన్నికలకు వెళ్దాం’’ అని సీఎం కేసీఆర్ అన్నట్టు తెలిసింది. సాంకేతికంగా ఇప్పుడే దొరికిపోవడం కన్నా.. రాజీనామా చేసే వరకు జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతోనే గుత్తా గులాబీ కండువా కప్పుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.