
'వంట చేయడం చాలా ఇష్టం.. కానీ టైం లేదు'
బంజారాహిల్స్ : వంట చేయడం అంటే తనకు చాలా ఇష్టమని అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వంట చేసే సమయం దొరకడం లేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. తాను మంచి భోజన ప్రియురాలినని, బంగ్లాకోడి వంటకం అంటే చాలా ఇష్టమని వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లో ఉలవచారు టై రెస్టారెంట్‌ను ఆమె శనివారం జస్టిస్ సుభాషణ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఉలవచారు తన దృష్టిలో బెస్ట్ ఫుడ్ అని, రెండు వారాలకోసారి ఈ హోటల్ నుంచే తెప్పించుకుంటానని వెల్లడించారు.
పేరు నిండా ఆంధ్రాతనం ఉన్నా ఇక్కడన్నీ తెలంగాణ వంటకాలే లభిస్తుండటం విశేషం అన్నారు. ఇండియాలోనే హైదరాబాద్ ఫుడ్‌కు ఒక ప్రత్యేకత ఉందని.. ముఖ్యంగా 50 రకాల బిర్యానీలు లభ్యమవుతాయని చెప్పారు. లోకాయుక్త జస్టిస్ సుభాషణ్ రెడ్డి మాట్లాడుతూ.. తాను కూడా భోజన ప్రియుడినేనని, రాజుగారి కోడి పులావ్ అంటే ఇష్టమని తెలిపారు. హైదరాబాద్ అంటే పెరల్స్, బ్యాంగిల్స్ మాత్రమే కాదని బిర్యానీ కూడా ఉందన్నారు.
'ముహూర్తం చూసుకుని పిల్లలను కనటం దురదృష్టకరం'
బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో పిల్లల ఆస్పత్రి రెయిన్‌బో 'బర్త్ రైట్ బై రెయిన్‌బో' నినాదంతో ప్రవేశపెట్టిన కొత్త బ్రాండ్‌ను ఎంపీ కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె.. ముహూర్తం చూసి పిల్లలను కంటున్నారని, ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సహజ ప్రసవాలపై ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు అవగాహన తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా హీరో మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ బర్త్ రైట్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు.