ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎన్నికలకు సిద్ధమా?
ఎంపీ మిథున్‌రెడ్డి సవాల్... తిరిగి పార్టీలో చేరిన బెరైడ్డిపల్లి ఎంపీపీ
సాక్షి, హైదరాబాద్ : ఓ పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలు మరో పార్టీలోకి ఫిరాయించడం అనేది పూర్తిగా అనైతికమని, వారు తమ పదవులకు రాజీనామాలు చేసి మళ్లీ పోటీ చేసి నెగ్గాలని రాజంపేట ఎం.పి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సవాలు చేశారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గంలోని బెరైడ్డిపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలు విమల తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీలో చేరుతున్నామని చెబుతున్న ఎమ్మెల్యేలు నిజంగానే అభివృద్ధిని చూసి చేరారా? లేక స్వీయ ప్రయోజనాల కోసమా? అనేది చెప్పాలని మిథున్ డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చనపుడు అభివృద్ధి ఎక్కడ జరుగుతోందని ఆయన ప్రశ్నించారు.జగన్ పేరుతో, వైఎస్సార్‌సీపీ గుర్తుపై ఎన్నికైన వారు తమ నిజాయితీని నిరూపించుకోవాలంటే రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధపడాలన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్‌లోనే ఉంటాం: విమల
తాను వైఎస్సార్ సీపీలోనే కొనసాగుతానని బెరైడ్డిపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలు విమల పేర్కొన్నారు. పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమరనాథ్‌రెడ్డి కుమారుడి నిశ్చితార్థం తిరుపతిలో ఉంటే హాజరు కావడానికి తాను వెళ్లానని అక్కడి నుంచి పెద్ద వాళ్లను కలవడానికి వెళుతున్నామంటూ నేరుగా సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి తన ప్రమేయం లేకుండా టీడీపీ కండువాను కప్పించారని ఆమె మీడియాతో అన్నారు. ఎమ్మెల్యే పార్టీ మారినా తమ నియోజకవర్గంలో క్యాడర్ చెక్కు చెదరలేదని, జగన్‌ను సీఎంను చేసే వరకూ పార్టీ కోసం శ్రమిస్తామన్నారు. విమలతో పాటు వచ్చిన 9 మంది ఎంపీటీసీలు మాట్లాడుతూ తాము జగన్‌తోనే ఉంటామని చెప్పామన్నారు.