సిటీలో ‘మల్టీ’ ఫ్లైఓవర్లు | multi level fly overs in hyderabad | Sakshi
Sakshi News home page

సిటీలో ఆరు లేన్ల భారీ ఫ్లైఓవర్

Published Sun, Jun 18 2017 7:17 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

సిటీలో ‘మల్టీ’ ఫ్లైఓవర్లు - Sakshi

సిటీలో ‘మల్టీ’ ఫ్లైఓవర్లు

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ నగరాన్ని గ్లోబల్‌స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు ఎస్సార్‌డీపీ(వ్యూహాత్మక రహదారుల పథకం) పనుల్లో భాగంగా షేక్‌పేట నుంచి విస్పర్‌ వ్యాలీ వరకు ఆరు లేన్ల భారీ ఫ్లైఓవర్, మరో మూడు జంక్షన్లలో మల్టీ లెవెల్‌ ఫ్లై ఓవర్ల పనులకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాధాన్యత క్రమంలో వీటిని చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీకి అనుమతినిస్తూ  పరిపాలనపర అనుమతులు జారీ చేసింది.

 

రూ.263.09 కోట్లతో మూడు జంక్షన్ల పనులకు శనివారం జీవో జారీచేయగా,  రూ. 333.55 కోట్లతో భారీ ఫ్లైఓవర్‌ పనులకు ఇటీవలే జీవో జారీ చేసింది. వెరసి మొత్తం రూ.596.64 కోట్ల పనులకు టెండర్లు పిలవనున్నారు. ఈ పనులు ఎస్సార్‌డీపీ మలిదశల్లో ఉన్నప్పటికీ, ఐటీ కారిడార్‌లో  రోజురోజుకూ తీవ్రమవుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యత క్రమంలో వీటిని నిర్మించాలని మునిసిపల్‌ మంత్రి కేటీఆర్‌ భావించిన నేపథ్యంలో వీటికి ప్రాధాన్యత నిచ్చారు.

ఆరు లేన్ల ఫ్లైఓవర్‌..
ఇందులో షేక్‌పేట కులీఖుతుబ్‌షాసెవెన్‌ టూంబ్స్‌ నుంచి ఫిల్మ్‌నగర్‌ రోడ్‌ జంక్షన్, ఓయూ కాలనీ జంక్షన్, విస్పర్‌వ్యాలీ జంక్షన్‌(మహా ప్రస్థానం) వరకు దాదాపు 2.8 కి.మీ.ల మేర ఫ్లైౖఓవర్‌ నిర్మించనున్నారు. టూ వే ఆరు లేన్ల ఫ్లైఓవర్‌ ఇది. కోర్‌ ఏరియా(పాత ఎంసీహెచ్‌) ప్రాంతం నుంచి హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వైపు వెళ్లే  వారికి ఎదురవుతున్న ట్రాఫిక్‌ ఇబ్బందుల్ని తొలగించేందుకు దీన్ని  నిర్మించనున్నారు. మెహదీపట్నం, అత్తాపూర్‌ తదితర ప్రాంతాల నుంచి టోలిచౌకి ఫ్లైఓవర్‌ మీదుగా హైటెక్‌ సిటీవైపు వెళ్తున్న వారికి ఫ్లైఓవర్‌ దాటాక తీవ్ర ట్రాఫిక్‌ చిక్కులు ఎదురువుతున్నాయి. కొత్తగా నిర్మించబోయే ఆరులేన్ల ఈ ఫ్లైఓవర్‌ ద్వారా వీరితోపాటు కోర్‌ ఏరియాలోని వివిధ ప్రాంతాల నుంచి ఐటీ హబ్‌ వైపు వెళ్లే వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా  ఉంటుందని భావిస్తున్నారు.

మూడు జంక్షన్లలో మల్టీ ఫ్లైఓవర్లు..

  • ఐటీ కారిడార్‌లోని  మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు 1.8 కి.మీ. పరిధిలో  బొటానికల్‌ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్‌ జంక్షన్ల వద్ద  మల్టీ లెవెల్‌ ఫ్లైఓవర్‌ నిర్మించనున్నారు.
  • బొటానికల్‌ గార్డెన్‌కు 400 మీటర్ల ముందు నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లేందుకు ఒక ఫ్లైఓవర్‌ ప్రారంభమవుతుంది. ఇది నాలుగు లేన్ల ఒన్‌ వే ఫ్లైఓవర్‌
  • బొటానికల్‌ గార్డెన్‌ జంక్షన్‌ దగ్గర దీనికి ఒక అప్‌ర్యాంప్‌ కలుస్తుంది. ఇది రెండు లేన్ల  ఒన్‌ వే. ఐదు లేన్లుగా ఇది కొత్త గూడ జంక్షన్‌ వరకు కొనసాగుతుంది.
  • కొత్త గూడ జంక్షన్‌లో మూడు లేన్ల ఒన్‌వే డౌన్‌ ర్యాంప్‌ ఒకటి మాదాపూర్, హైటెక్‌సిటీ వైపు వెళ్లే వారికోసం నిర్మిస్తారు.
  • కొత్త గూడ జంక్షన్‌ నుంచి మియాపూర్‌ వైపు వెళ్లేందుకు కొండాపూర్‌ దగ్గర మూడు లేన్ల ఒన్‌వే డౌన్‌ ర్యాంప్‌ ఉంటుంది.  
  • మియాపూర్‌ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే ట్రాఫిక్‌ కోసం కొత్తగూడ జంక్షన్‌ వద్ద అండర్‌పాస్‌ నిర్మిస్తారు. దీన్ని రెండు లేన్లతో ఒన్‌వేగా నిర్మిస్తారు.
  • ఈ జంక్షన్ల వద్ద మల్టీ లెవెల్‌ ఫ్లైఓవర్లు,  ఆరు లేన్ల ఫ్లైఓవర్‌ నిర్మాణాలు పూర్తయితే ఐటీ  కారిడార్‌లో ట్రాఫిక్‌ ఇబ్బంది తగ్గుతుంది.


ప్రాజెక్టులు సరే.. నిధులేవీ..?
ఇవిలా ఉండగా, నాలాల  ఆధునీకరణ పనుల కోసం మరో రూ. 230 కోట్లకు ప్రభుత్వం శుక్రవారం జీహెచ్‌ఎంసీకి పరిపాలన అనుమతులిస్తూ జీవో జారీ చేసింది. ఈ పనులన్నింటినీ జీహెచ్‌ఎంసీ నిధులతోనే చేపట్టాల్సి ఉంది. ఈ మూడు ప్రాజెక్టులు కలిపితే దాదాపు రూ. 928 కోట్ల రూపాయలవుతుంది. జీహెచ్‌ఎంసీ ఖజానాలోని ఆదాయం నిర్వహణ పనులకే సరిపోతోంది. ఈ ప్రాజెక్టులతో పాటు ఇతరత్రా పనుల కోసం బాండ్ల జారీ, బ్యాంకు రుణాల ద్వారా రూ. 3500 కోట్లు సేకరించాలని భావించారు. ఆ పనుల కోసం జీహెచ్‌ఎంసీ గత ఏప్రిల్‌లో పంపిన ఫైలు ప్రభుత్వం వద్ద  ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే బాండ్ల జారీ ద్వారా రూ.1000 కోట్లు, బ్యాంకు రుణాల ద్వారా రూ. 2500 కోట్లు సేకరించే ప్రక్రియ ప్రారంభించాలని ఎదురు చూస్తున్నారు. అప్పటి దాకా ఏమీ చేయలేని పరిస్థితి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement