ఢిల్లీకి నారా లోకేశ్!
ఏపీ భవన్‌లో ప్రత్యేక ప్రతినిధిగా నియమించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీకి మకాం మార్చనున్నారు. ఇకనుంచి వారానికి రెండు, మూడు రోజులు అక్కడే ఉండనున్నారు. గతంలో కేంద్ర మంత్రివర్గంలో చేరి అక్కడ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక ప్రాత పోషించాలని లోకేశ్ భావించినప్పటికీ... రాజ్యసభకు వెళ్లి కేంద్ర మంత్రి అయితే దొడ్డిదోవలో మంత్రి అయ్యారనే అపవాదును ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ ఆలోచన విరమించారు. తాజాగా కేంద్రంలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వెళితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు కూడా అందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
లోకేశ్‌ను ఢిల్లీ పంపితే ఎలా ఉంటుందని ఇటీవల పార్టీ ముఖ్య నేతలతో సమావేశం సందర్భంగా చంద్రబాబు అడిగారని సమాచారం. ప్రస్తుతం అక్కడ ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కేబినెట్ మంత్రి హోదాలో ఉన్న కంభంపాటి రామ్మోహనరావుకు అందుకే కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వలేదని పార్టీ వర్గాలంటున్నాయి. అయితే లోకేశ్ ఢిల్లీ వెళుతున్నారని తెలిసిన పార్టీ నేతల్లో ఎక్కువమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ప్రత్యేకంగా గృహాన్ని కేటాయించింది.
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఇంటికోసం చేసుకున్న దరఖాస్తును కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి సుజనా చౌదరి చొరవ తీసుకుని క్లియర్ చేయించారు. ఈ మేరకు చంద్రబాబుకు జనపథ్‌లో ఇంటిని కేటాయించారు. ప్రస్తుతం ఈ ఇంటిలో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఢిల్లీ వెళ్లే లోకేశ్ ఇక్కడే నివాసం ఉండనున్నారు.