
‘కేసీఆర్‌వి పిచ్చి ప్రేలాపనలు’
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కమ్యూనిస్టులు కన్నెర్ర చేశారు. కమ్యూనిస్టు లకు కాలం చెల్లిందని కేసీఆర్ పిచ్చి ప్రేలా పనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌కు తమ పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కలలోకి వస్తున్నట్లున్నా రని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గసభ్యుడు కె.నారాయణ ఎద్దేవా చేశారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, నాయకులు అజీజ్‌పాషా, పల్లా వెంకటరెడ్డి, బాల మల్లేశ్ లతో కలసి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల సొమ్ముతో మొక్కులు తీర్చుకునే హక్కు సీఎంకు లేదన్నారు.
ధర్నాచౌక్‌ను నగరం బయటకు తరలిస్తే తమ వెంట సీఎం కేసీఆర్‌నూ ఊరు బయటకు తీసుకెళ్తామని హెచ్చరించారు. సెక్యులరిజం హంతకముఠా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న వెంకయ్య తన నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నాగయ్య కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వేర్వేరు ప్రకటనల్లో విమర్శించారు.