- నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లోకి పోలీసులు సులభంగా వెళ్లే వ్యూహం
- తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల అనుసంధానం
- రాష్ట్రంలో ఖమ్మం జిల్లా సారపాక నుంచి ఆదిలాబాద్ జిల్లా కౌటాల వరకు
సాక్షి, హైదరాబాద్: నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు పోలీసులు సులభంగా చేరుకునేందుకు కేంద్రం కొత్త వ్యూహం రచిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ జాతీయ రహదారి నిర్మాణానికిసిద్ధమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను అనుసంధానిస్తూ గోదావరి నది తీరం వెంబడి ఈ భారీ రహదారి రూపుదిద్దుకోనుంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన డీజీపీల సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు రాగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దీనికి ఆమోదముద్ర వేశారు. అనంతరం కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ కూడా ఈ జాతీయ రహదారికి పచ్చజెండా ఊపారు. ఈ రోడ్డులో భాగంగా తెలంగాణలో భద్రాచలం సమీపంలోని సారపాక నుంచి ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రం వరకు 400 కి.మీ. మేర నిర్మించనున్నారు.
దీనికి రూ.2 వేల కోట్లకు పైగా వ్యయమవుతుందని అంచనా. ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీలో గడ్కారీతో భేటీ అయినప్పుడు తెలంగాణ భూభాగంలో రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. దీనిపై జాతీయ రహదారుల విభాగం సమగ్ర సమాచార నివేదిక (డీపీఆర్) తయారీలో నిమగ్నమైంది. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాన్ని బుధవారం రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. ఆ సమయంలో ఈ ప్రస్తావన వచ్చింది. వెంటనే ప్రతిపాదనలు రూపొందించి ఢిల్లీకి పంపాలని, ఇప్పటికే పెండింగులో ఉన్న 1,487 కి.మీ. తెలంగాణ జాతీయ రహదారుల ప్రతిపాదనలతో కలిపి కేంద్రం పచ్చజెండా ఊపనుందని వెల్లడించారు.
గోదావరి వంతెనలతో అనుసంధానం
ఇటీవలి కాలంలో గోదావరి నదిపై అన్ని ప్రధాన ప్రాంతాల్లో వంతెనల నిర్మాణం జరుగుతోంది. వీటిని అనుసంధానిస్తూ ఈ జాతీయ రహదారి రూపుదిద్దుకుంటుంది. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే ఒక రాష్ట్ర సరిహద్దు నుంచి మరో రాష్ట్రంలోకి పోలీసు బలగాలు సులభంగా వెళ్లేందుకు వీలవుతుందని హోంశాఖ భావిస్తోంది. దీంతోపాటు గోదావరిలో జలరవాణాకు కేంద్రం భారీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నందున దానికి కూడా ఈ రోడ్డు అనుకూలంగా ఉంటుంది.
గోదావరిని ఆసరా చేసుకుని పర్యాటక రంగ అభివృద్ధికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో సారపాక, మణుగూరు, ఏటూరునాగారం, తుపాకుల గూడెం, కాళేశ్వరం, సిర్పూర్, కౌటాలను అనుసంధానిస్తూ ఈ 400 కి.మీ. రోడ్డు నిర్మాణం కానుంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల నిర్మాణంలో వేగం మందగించడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పనుల వేగాన్ని పెంచాలని సమీక్షలో అధికారులను ఆదేశించారు.