వందేళ్ల కిందటే స్వచ్ఛభారత్..
హైదరాబాద్: స్వచ్ఛభారత్ కాన్సెప్ట్ ఇప్పటికాదని, వందేళ్ల కిందటే అలాంటి కార్యక్రమాన్ని సామాజిక పోరాటయోధుడు సంత్ గాడ్గే బాబా మహారాజ్ ఆచరించి చూపారని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. సంత్ గాడ్గే 60వ వర్ధంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న నాయిని.. గాడ్గే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
గాడ్గే బాబా నాడు నాటిన బీజమే నేటి స్వచ్ఛభారత్‌కు మూలమని, ఆ మహానుభావుడి జీవిత చరిత్రను భావి తరాలకు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ పోరాట చరిత్రను సైతం ప్రచారంలోకి తెస్తామని, ట్యాంక్‌బండ్‌పై ఆమె విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పగడాల లింగయ్య, చిట్యాల రామస్వామి, సహాయ కార్యదర్శులు సుధాకర్, రంగస్వామి, కార్యదర్శి కె.వెంకటయ్య, నగర నాయకులు కె.యుగంధర్, నాంపల్లి సంపత్ కుమార్, లక్ష్మీ నారాయణ, ఎం.నర్సింగ్, జె.అనిల్ తదితరులు పాల్గొన్నారు.