నయీమ్ ఆస్తులకు లెక్కేలేదు.. | nayim assets revealed police and more details | Sakshi
Sakshi News home page

నయీమ్ ఆస్తులకు లెక్కేలేదు..

Published Thu, Aug 18 2016 1:53 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

నయీమ్ ఆస్తులకు లెక్కేలేదు.. - Sakshi

నయీమ్ ఆస్తులకు లెక్కేలేదు..

పోలీసులకు సైతం అంతుపట్టని నయీమ్ ‘ఖజానా’
రాష్ట్రంలోని ఖరీదైన ప్రాంతాల్లో 1,015 ఎకరాల్లో వెంచర్లు
మరో లక్షన్నర గజాలకు పైగా విస్తీర్ణంలో ఇళ్లు, కాంప్లెక్సులు
ఈ మొత్తం ఆస్తుల విలువ రూ.వేల కోట్లలో..
ఇక ఇతర రాష్ట్రాల్లో ఎన్నున్నాయో..!

సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్ జరిగి పదిరోజులవుతున్నా అతడి ఆస్తుల లెక్కలు పోలీసులకు అంతుపట్టడం లేదు. ఆస్తుల చిట్టా విప్పే కొద్దీ బయటకొస్తోంది.. ఎక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయో అధికారులు సైతం ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఇప్పటివరకు సిట్ గుర్తించిన ఆస్తులే దిమ్మ తిరిగిపోయేలా ఉన్నాయి. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న వందలాది డాక్యుమెంట్లను సిట్ క్షుణ్నంగా పరిశీలిస్తోంది. ఒక్క రాష్ట్రంలోనే నయీమ్ చెరలో ఖరీదైన ప్రాంతాల్లో 1,015 ఎకరాల భూమిలో వెంచర్లు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చిన సిట్..

రెవెన్యూ అధికారులతో కలసి ఈ స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలి స్తోంది. వీటితోపాటు రాష్ట్రంలోని ముఖ్య పట్టణాల్లోనూ లక్షన్నర గజాలకు పైగా విస్తీర్ణంలో ఇళ్లు, షాపింగ్ కాంప్లెక్స్, ఓపెన్ ఫ్లాట్లు ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. ఈ ఆస్తుల విలువను ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ ప్రకా రం కేవలం రూ.14.39 కోట్లుగా లెక్కగడుతున్నారు. అయితే మార్కెట్‌లో వీటి విలువ రూ.1,500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

హైదరాబాద్ పరిసరాల్లోని కొండాపూర్ ఏరియాలో నయీమ్ చెరలో ఉన్న 9 ఎకరాల స్థలమే దాదాపు రూ.200 కోట్లు ధర పలుకుతోంది. నయీమ్ ఆస్తులన్నీ హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటం తో వాటి విలువ వేలాది కోట్లలో ఉంటుందని స్పష్టమవుతోంది. ఇక మిగతా రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో ఇంకెన్ని ఆస్తులు ఉన్నాయనే విషయాలు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది.

 సిటీలో షాపింగ్ కాంప్లెక్స్‌లు..?
నయీమ్ ఇంటి వద్ద లభించిన పత్రాల్లో సిటీల్లోనూ షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఇళ్లు, ఫ్లాట్ల రూపంలో 1,67,117 గజాల భూమి ఉందని పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో మూడు షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయని గుర్తించిన సిట్ అధికారులు ఇప్పటికే అక్కడ తనిఖీలు చేసినట్లు సమాచారం. వీటితోపాటు ఓపెన్ ప్లాట్ల వివరాలను పూర్తిస్థాయిలో సేకరించారు. పుప్పాలగూడ పరిధిలోని నెక్నాంపూర్ గ్రామపంచాయతీ అల్కాపురి టౌన్‌షిప్‌లోని నయీమ్ ఇంటితోపాటు అతడి వంట మనిషి ఫర్హానా పేరిట ఉన్న అంజలీ గార్డెన్, తిరుమల గార్డెన్‌లోని ఇళ్లను కూడా పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారు.

 మిగతా ఐదు రాష్ట్రాల్లో ఆస్తులెన్నో..!
రాష్ట్రంలోనే వేల కోట్ల ఆస్తులుంటే నయీమ్ దందా సాగిన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో ఎన్ని ఆస్తులు ఉంటాయన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే సైబరాబాద్ వెస్ట్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించిన నయీమ్ వంట మనిషి ఫర్హానా, అతడి డ్రైవర్ భార్య ఆఫ్సాలు వెల్లడించిన ప్రకారం ఆ ఐదు రాష్ట్రాల్లో ఆస్తులున్నట్టుగా తెలిసింది. వీటిని గుర్తించేందుకు న్యాయస్థానం ఆ ఇద్దరినీ బుధవారం నుంచి ఆరు రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వడంతో ఏపీతోపాటు మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు తీసుకెళుతున్నారు. అలాగే మహబూబ్‌నగర్‌లోని షాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేసిన నయీమ్ భార్య హసీనా బేగం, అక్క సలీమా బేగం, షాద్‌నగర్ ఇంటికి చెందిన వాచ్‌మన్ మతీన్, అతని భార్య ఖలీమా బేగంలను వారంరోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో వారిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. వీరి విచారణలో కూడా మరిన్ని ఆస్తుల వివరాలు పూర్తిస్థాయిలో తెలిసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.

కన్ను పడిందంటే వదలడు..
ఏదైనా భూమిపై నయీమ్ కన్ను పడిందంటే అది అతడి చేతికి చిక్కాల్సిందే. నగరం, పట్టణం, గ్రామం అనే తేడా ఉండదు. ఆ భూమి ఎవరిదైనా వశం కావల్సిందేనన్నది నయీమ్ సిద్ధాంతం. ఇలా రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాల్లో పట్టణాలకు దగ్గరగా ఉండే వ్యవసాయ భూములను అనుచరగణంతో కలసి కబ్జా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వ్యవసాయ భూములను ఓపెన్ ప్లాట్లుగా చేసి రియల్ ఎస్టేట్ దందా సాగించాలనుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది అనుచరులను ఈ దిశగా రంగంలోకి దింపాడని తెలుస్తోంది. అలాగే హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, కరీంనగర్, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో 20 ఇళ్ల ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement