వర్షాల ప్రభావం, పునరుద్ధరణ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కేటీఆర్
- వర్షాలతో అసౌకర్యంపై ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ
- 100, 040-21111111 నంబర్లతో కాల్ సెంటర్ ఏర్పాటు
- సమీక్షలో మంత్రి కేటీఆర్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వర్షాలతో హైదరాబాద్ నగరంలో కలిగిన అసౌకర్యాలను తొలగించి, యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు 24 గంటల కాల్ సెంటర్‌ను వారం రోజుల్లో ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. 100, 040-21111111 (జీహెచ్‌ఎంసీ) నంబర్లతో ఈ కాల్‌సెంటర్ పనిచేస్తుందన్నారు. వర్షాల ప్రభావం, పునరుద్ధరణ చర్యలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
నగరంలో విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ, రోడ్లపై కూలిన చెట్ల తొలగింపునకు అధిక సమయాన్ని తీసుకోవడం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా, మీడియా ద్వారా అనేక రకాల వార్తలు తమ దృష్టికి వస్తున్నాయన్నారు. విద్యుత్ మరియు జీహెచ్‌ఎంసీలు ఇతర ప్రభుత్వ శాఖలతో కలసి సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇందుకోసం ఇప్పుడున్న జాయింట్ వర్కింగ్ గ్రూపులను మరింత క్రియాశీలం చేయాలన్నారు. పునరుద్ధరణ పనుల్లో హైదరాబాద్ జిల్లా యంత్రాంగాన్ని సైతం భాగస్వాముల్ని చేయాలన్నారు. పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తిచేశామని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్నారు.
జీహెచ్‌ఎంసీ, విద్యుత్ అధికారులు నగరంలో చేపట్టిన పునరుద్ధరణ చర్యల గురించి మంత్రికి వివరించారు. నగరంలో సుమారు 9.8 లక్షల విద్యుత్ స్తంభాలుంటే అందులో 1,500 స్తంభాలు కూలిపోవడం లేదా వంగిపోవడం జరిగిందన్నారు. ఇప్పటికే 99 శాతం పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయన్నారు.
వర్షాకాల ప్రణాళిక రూపొందించుకోవాలి
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వర్షాకాల ప్రణాళికను రూపొందించుకుని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకుని, దెబ్బతిన్న ప్రాంతాలకి వెంటనే వెళ్లేలా మొబైల్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. వర్షాకాల ప్రణాళికలో భాగంగా అదనపు సిబ్బందిని, మానవ వనరులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రోడ్లపై నీళ్లు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సమస్యాత్మక ప్రాంతాలను ముందే గుర్తించి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.