
భర్త సరదాగా లేడని నవ వధువు ఆత్మహత్య
హైదరాబాద్: కుటుంబ కలహాలతో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నం గాజువాకకు చెందిన రజిని(29)అదే ప్రాంతానికి చెందిన రమేష్‌కుమార్‌తో ఫిబ్రవరి 11వ తేదీన వివాహం జరిగింది. నెల కిందట దంపతులు ఇద్దరూ శ్రీకృష్ణానగర్ లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రజని ఓ వార్తా సంస్థకు చెందిన జర్నలిజం స్కూల్‌లో ట్రైనీ రిపోర్టర్‌గా శిక్షణ తీసుకుంటుండగా నరేష్‌కుమార్ సినీ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. పెళ్ళి అయిన మరుసటి రోజు నుంచే భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
సాయంత్రం ఆరు గంటలకల్లా ఇంటికి వచ్చి తనతో కలిసి నగరంలో వివిధ ప్రాంతాలకు సందర్శనకు రావాలని రజిని భర్తను కోరేది. అయితే తాను పని చేసేది సినీ పరిశ్రమలో కాబట్టి సాయంత్రం త్వరగా ఇంటికి రావడం కుదరదని రమేష్ చెప్పడంతో గత కొద్ది రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరాయి. వారం క్రితం ఇదే విషయంలో గొడవ జరగగా రజిని తల్లిదండ్రులు వచ్చి కూతురికి నచ్చజెప్పి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం రజిని తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గది నుంచి ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో రమేష్‌తో పాటు ఆయన తల్లి రామలక్ష్మి గది తలుపు సందులోంచి చూడగా ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఈ విషయంపై రమేష్ ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా రమేశ్ మొదటిభార్య కూడా పెళ్లి అయిన ఏడాదిన్నరకు ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం పోలీసుల విచారణలో తేలింది.