కట్టుకున్న భర్త తన తల్లిని దుర్భాషలాడాడని మనస్తాపానికి గురైన నవ వధువు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
పహాడీషరీఫ్: కట్టుకున్న భర్త తన తల్లిని దుర్భాషలాడాడని మనస్తాపానికి గురైన నవ వధువు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై నర్సింగ్ రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం....కొత్తపేటకు చెందిన అబ్దుల్లా బిన్ సాల్హెకు ఐదు నెలల క్రితం పర్వీన్ బేగం(30)తో వివాహమైంది. కాగా పెళ్లైన కొన్ని రోజుల నుంచే పర్వీన్ బేగాన్ని అదనపు కట్నం తీసుకురావాలంటూ అబ్దుల్లా వేధించసాగాడు.
దీంతో పర్వీన్ వేధింపుల విషయాన్ని తల్లికి తెలియజేయడంతో ఆగ్రహానికి గురైన ఆమె తల్లి.. అల్లుడికి ఫోన్ చేసి గట్టిగా ప్రశ్నించింది. దీనికి ప్రతిగా అల్లుడు ఆమెను దూషించాడు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన పర్వీన్ తన వల్లే తల్లిదండ్రులకు ఇన్ని కష్టాలని భావించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.