ఢిల్లీపై గురిపెట్టిన ఐసిస్‌ టెర్రరిస్ట్‌లు | NIA arrests 14 ISIS sympathisers in nationwide raids | Sakshi
Sakshi News home page

ఢిల్లీపై గురిపెట్టిన ఐసిస్‌ టెర్రరిస్ట్‌లు

Published Fri, Jan 22 2016 7:08 PM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM

ఢిల్లీపై గురిపెట్టిన ఐసిస్‌ టెర్రరిస్ట్‌లు - Sakshi

ఢిల్లీపై గురిపెట్టిన ఐసిస్‌ టెర్రరిస్ట్‌లు

హైదరాబాద్ : హైదరాబాద్లో మరోసారి ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరుల అరెస్ట్ కలకలం రేపుతోంది. కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ తన సామ్రాజ్యాన్ని భారత్‌లోనూ విస్తరించుకోవడానికి కొత్త ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఉద్యోగాల పేరుతో హైదరాబాద్‌లో పాగా వేస్తోంది. తాజాగా నలుగురు ఐసిస్ సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేశారు. టోలీచౌకీకి చెందిన నఫీజ్ ఖాన్, ఒబేదుల్లా ఖాన్, మొయినుద్దీన్, అబు అమ్సర్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

ఇప్పటి వరకు యూరప్, అరబ్ దేశాలనే టార్గెట్ చేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఇప్పుడు భారత్‌పై గురి పెట్టిందని బయటపడింది. చాపకింద నీరులా దేశంలో ఐసిస్ విస్తరించిందని, పలు ప్రాంతాల్లో సానుభూతిపరులను కూడా తయారు చేసుకుందని వెలుగుచూసింది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దర్యాప్తు బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఈ సోదాల్లో 14 మంది ఐసిస్ సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 12 మందిని ఎన్ఐఏ అరెస్టు చేయగా, మరో ఇద్దరిని మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.

కర్ణాటక, హైదరాబాద్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్‌లు జరిగాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. పట్టుబడిన వారంతా జనూద్-ఉల్-ఖలీఫా-ఇ-హింద్ పేరుతో ముఠాను ఏర్పాటు చేసుకున్నారని హోంశాఖ పేర్కొంది. హరిద్వార్‌లో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి సమాచారం ఆధారంగా ముంబైలో మునబిర్ ముస్తాక్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడే అమీర్ అనే మారుపేరుతో ఉగ్ర వాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పసిగట్టారు. జనూద్-ఉల్-ఖలీఫా-ఇ-హింద్‌కు ఇతనే నాయకుడని బయటపడింది. అమీర్ అరెస్ట్‌ తర్వాత సోదాలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో టోలీచౌకీకి చెందిన నఫీజ్ ఖాన్, ఉబేదుల్లా ఖాన్, షరీఫ్ మొయినుద్దీన్‌, మాదాపూర్‌లో ఐటీ ఉద్యోగి అబూ అమాస్‌ దొరికిపోయారు. నఫీజ్ నుంచి భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారంతా ఆన్‌లైన్ ద్వారా ఉగ్రవాదాన్ని విస్తరిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. వారి నుంచి 42 ఫోన్లు, పేలుడు పదార్థాలు, డిటోనేటర్లు, వైర్లు, బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

ఇక కర్ణాటకలో ఏడుగురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. ఐసిస్ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న నజ్మల్ హుదా, సయ్యద్ హుస్సేన్‌లను  బెంగళూరు ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిపబ్లిక్ డే రోజున దాడులకు వారు ప్లాన్ చేశారని పోలీసులు పేర్కొన్నారు. తుముకూరుకు చెందిన సయ్యద్ హుస్సేన్ బెంగళూరులో డిప్లొమా చేస్తున్నట్లు సమాచారం. నజ్ముల్‌ హుదా మంగళూరులోని బాజ్‌పే సమీపంలో ఉన్న పెర్ముడే గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 25 ఏళ్ల హుదా మంగళూరులోనే కెమికల్ ఇంజినీరింగ్ చేస్తున్నాడు. వీరి కదలికలపై కొంత కాలంగా నిఘా పెట్టిన పోలీసులు ఈ తెల్లవారుజామున వారిద్దరినీ అరెస్టు చేశారు. అలాగే జక్కసంద్ర, బెంగళూరుల్లో నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులోని ఫ్రాన్స్ కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ ఇటీవల పోలీసులకు బెదిరింపు ఉత్తరం వచ్చింది. ఈ లేఖతో హుదా, హుస్సేన్‌కు సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

మహారాష్ట్రలోనూ ఓ అనుమానిత ఉగ్రవాది అరెస్టయ్యాడు. ఐసిస్ సానుభూతిపరుడిగా అనుమానిస్తున్న ఓ యువకుడిని ముంబై ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐబీ హెచ్చరికలక నేపథ్యంలో పోలీసు వర్గాలు కొన్ని రోజులుగా ఆ యువకుడి కదలికలపై నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో అతని వ్యవహారశైలి సందేహాస్పదంగా మారడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గణతంత్ర దినోత్సవాల్లో పేలుళ్లకు అతను ప్లాన్ చేసినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.

కాగా మూడు రోజుల క్రితమే ఉత్తరాఖండ్‌లో నలుగురు ఐసిస్ అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్‌లో మారణహోమం సృష్టించేందుకు ఉగ్రవాదుల పన్నిన కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో  విస్తృతంగా తనిఖీలు చేపట్టిన సైన్యం నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. పోలీసుల విచారణలో ఆ నలుగురు అనుమానితులకు ఐసిస్‌ ఉగ్రవాదసంస్థతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. ఈ నలుగురు అనుమానిత ఉగ్రవాదులు తమకు తామే ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న అర్థ కుంభమేళాను టెర్రరిస్టులు టార్గెట్ చేశారని తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement