ఇక ప్రతి సేవకూ యూజర్ చార్జీలు
♦ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్నేతర ఆదాయానికి చర్యలు
♦ ద్రవ్య విధానపత్రంలో తెలిపిన ఆర్థికమంత్రి
♦ తద్వారా యూజర్‌చార్జీల విధింపు తప్పదని సంకేతాలు
సాక్షి, హైదరాబాద్: ఇకమీదట రాష్ట్ర ప్రజలకు అందే ప్రతీ సేవకు యూజర్‌చార్జీలను రాష్ట్రప్రభుత్వం వసూలు చేయనుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం అసెంబ్లీలో ద్రవ్య విధానపత్రాన్ని ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్నేతర ఆదాయం పెంచడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోనున్నట్టు అందులో పేర్కొన్నారు. తద్వారా ప్రజలకందే ప్రతీ సేవలకు యూజర్‌చార్జీల విధింపు తప్పదని పరోక్షంగా ఆయన స్పష్టం చేసినట్లయింది.
కాగా మరో 24 గంటల్లో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం.. బడ్జెట్‌లో పేర్కొన్న లక్ష్యాల మేరకు వస్తున్నట్లు యనమల ద్రవ్య విధాన పత్రంలో ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సొంత పన్నుల ద్వారా రూ.44,423.42 కోట్ల మేర ఆదాయం వస్తుందని లక్ష్యంగా నిర్ధారించుకోగా 2015-16 ఆర్థిక సంవత్సరం మార్చిలో సవరించిన అంచనాల్లోనూ రూ.44,423.42 కోట్ల ఆదాయమొస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
రెవెన్యూ వ్యయం నియంత్రణలో భాగంగా పరిపాలన వ్యయాన్ని తగ్గించనున్నట్లు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా పరిపాలన వ్యయాన్ని తగ్గించడంతోపాటు పన్నుల పారిపాలన సామర్ధ్యాన్ని పెంచడం ద్వారా అవసరమైన ఆర్థిక వనరుల్ని సమీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 2015-16 బడ్జెట్‌లో సవరించిన అంచనాల మేరకు రాష్ట్ర అప్పులు రూ.1,65,690.60 కోట్లు ఉన్నట్లు ద్రవ్య విధాన పత్రంలో ఆర్థికమంత్రి వెల్లడించారు.
29,772 మంది ఉద్యోగులు తగ్గిపోయారు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఏడాది వ్యవధిలో 29,772 మేరకు తగ్గిపోయింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ద్రవ్యవిధాన పత్రం ఈ విషయాన్ని తేటతెల్లం చేసింది. గత బడ్జెట్ సమయంలో మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పత్రంలో 5,18,257 మంది ఉద్యోగులున్నట్లు పేర్కొన్నారు. బుధవారం నాటి పత్రంలో ఈ సంఖ్యను 4,88,485గా పేర్కొన్నారు. మరోవైపు 2016-17 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున ఆర్థిక మంత్రి 2015-16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో సవరించిన మేరకు ప్రణాళికేతర వ్యయం రూ.73,546 కోట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం సమర్పించిన పత్రంలో దీనిని రూ.67,530 కోట్లుగా పేర్కొన్నారు. కేవలం పక్షం రోజుల్లోనే ప్రణాళికేతర వ్యయంలో ఇంత అంతరం ఏర్పడడం చూస్తుంటే బడ్జెట్ కేటాయింపులు, సవరణల్లో విశ్వసనీయత ఏపాటిదో అర్థమవుతోంది.