'నాగార్జున ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణమే'
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ వ్యవహారంపై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఆదేశించింది. జీహెచ్ఎంసీ, రెవిన్యూ అధికారులు హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్ భవనాన్ని తనిఖీ చేసి అక్రమ నిర్మాణం చేపట్టారని గుర్తించగా, ఎన్ కన్వెన్షన్ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం విచారణ జరిగింది.
ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణమేనని తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి హైకోర్టులో వాదించారు. అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టారని చెప్పారు. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ఎన్‌కన్వెన్షన్ నిర్మాణానికి చేసిన దరఖాస్తును జీహెచ్‌ఎంసీ తిరస్కరించిందని అన్నారు. తనిఖీలు కోసమే ఎన్‌కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లారని కోర్టుకు తెలిపారు. హైదరాబాద్‌లో చెరువులను పట్టించుకోవడం లేదంటూ లోకాయుక్తలో గతంలో అనేక పిటిషన్లు దాఖలయ్యాయని, లోకాయుక్త ఆదేశాలమేరకే లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఎన్‌కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లిందని రామకృష్ణారెడ్డి తెలిపారు. జీహెచ్‌ఎంసీకి కూల్చివేతతో సహా అన్ని అధికారాలున్నాయని, హైకోర్టు నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ఎలాంటి చర్యలకూ దిగబోమని చెప్పారు.
కాగా ఇది ఏమాత్రం సర్వే ఎక్సర్‌సైజ్ కాదని, నోటీసులు ఇవ్వకుండా వ్యక్తుల ఆస్తుల్లోకి చొరబడటం హక్కులకు భంగం కలిగించడమేనని ఎన్ కన్వెన్షన్ తరపు న్యాయవాదులు వాదించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు చట్టపరమైన ప్రక్రియను అనుసరించలేదని చెప్పారు. ప్రైవేటు ఆస్తుల్లో తనిఖీలు చేసేముందు కచ్చితంగా నోటీసులు ఇవ్వాలని పేర్కొన్నారు.