అందుకే ఈ విజయం - నాగార్జున
‘‘ఎడిటర్ గౌతంరాజుగారి జడ్జిమెంట్ కరెక్ట్‌గా ఉంటుంది. ఎడిటింగ్ చేయగానే... సినిమా గురించి నాకు ఫోన్ చేసి చెబుతారు. ఆయన చెప్పినట్టే ఫలితం కూడా ఉంటుంది. ‘అడ్డా’ ఎడిటింగ్ అవ్వగానే... ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారు. సినిమా చాలా బాగా వచ్చిందని. అన్నట్టే సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాకు సమయం కూడా కలిసొచ్చింది. అందుకే ఈ విజయం’’ అన్నారు అక్కినేని నాగార్జున. సుశాంత్ కథానాయకునిగా జి.సాయికార్తీక్ దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, నాగసుశీల కలిసి నిర్మించిన చిత్రం ‘అడ్డా’.
అనూప్ రూబెన్స్ స్వరాలందించిన ఈ చిత్రం ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ -‘‘ఇటీవలే ‘అడ్డా’ చూశాను. కథ, కథనం, పాటలు నచ్చాయి. హిట్ సినిమాకు ఉండాల్సిన అంశాలన్నీ ఇందులో ఉన్నాయనిపించింది. ఈ సినిమా విడుదల టైమ్‌లో నేను ముంబయ్‌లో ఉన్నాను. సుశాంత్ బాగా చేశాడని అందరూ ఫోన్లు చేసి చెబుతుంటే చాలా సంతోషించాను. అనుకున్నట్టే సినిమాలో తను బాగా చేశాడు. దర్శకుడు కూడా తొలి చిత్రంతోనే ప్రతిభ కనబరిచాడు. ఇక అనూప్ మ్యూజిక్ చాలా బాగుంది’’ అని అభినందించారు.
సినిమాను హిట్ చేయాలనే తపనతో అందరూ ఈ సినిమాకు పనిచేశారని సుశాంత్ చెప్పారు. ప్రేక్షకాదరణ రోజురోజుకీ పెరుగుతోందని చింతలపూడి శ్రీనివాసరావు చెప్పారు. తమ్ముడు నాగార్జున సమక్షంలో ఈ వేడుక జరగడం ఆనందంగా ఉందని నాగసుశీల తెలిపారు. అనూప్, సాయికార్తీక్ కూడా మాట్లాడారు. తదనంతరం నాగార్జున చేతుల మీదుగా డిస్క్‌ల ప్రదానం జరిగింది.