
హోదా ఇచ్చే అవకాశం లేదు: వెంకయ్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదాతో ప్రయోజనాలున్నాయని ఆయన అంగీకరించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... 14వ ఆర్థిక సంఘం సూచన మేరకు ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదన్నారు. విభజన చట్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడదీసిందని విమర్శించారు. ప్రత్యేక హోదాను విభజన చట్టంలో కాంగ్రెస్ చేర్చలేదని తెలిపారు.
విభజన చట్టంలో లొసుగులు ఉన్నాయని చెప్పారు. విభజనతో జరిగిన ఆంధ్రప్రదేశ్ కు జరిగిన నష్టాన్ని సరిదిద్దాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ప్రత్యేక హోదాతో ప్రతి ఊరు ఆరు నెలల్లో హైదరాబాద్ అయిపోతుందని చేస్తున్న ప్రచారం సరికాదన్నారు. ప్రత్యేక హోదాతో ఏవైతే ప్రయోజనాలు కలుగుతాయే వాటిని ఏపీకి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. నూటికి నూరుశాతం పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేస్తుందని హామీయిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇప్పటివరకు మంజూరు చేసిన సంస్థలు, ఆర్థిక ప్రయోజనాలను ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మరోసారి ఉటంకించారు.