
ప్రవాసుల కోసం ‘ఎన్నారై పాలసీ’
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: ప్రవాస భారతీయుల కోసం త్వరలో ప్రత్యేక ఎన్నారై పాలసీ తీసుకురానున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. సోమవారం లండన్‌లో ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్-యూకే, హైదరాబాద్ అసోసియేషన్ యూకే సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ విత్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రవాస భారతీయుల పాత్ర గొప్పదని అభివర్ణించారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని... ప్రధాని మోదీ సీఎం కృషిని ప్రశంసించారని ఆయన గుర్తు చేశారు.
త్వరలో రానున్న ఎన్నారై పాలసీ రూపకల్పన కోసం సలహాలు, సూచనలు ఉంటే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొని రావాలని సూచించారు. ఎన్నారై టీఆర్‌ఎస్ కార్యదర్శి నవీన్ రెడ్డి, హైదరాబాద్ అసోసియేషన్ యూకే ఉపాధ్యక్షుడు షా నవాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూకే ల్యామ్ బెత్ మేయర్ సాలేహా జాఫర్, హౌన్‌స్లా మాజీ మేయర్ నసీర్ మాలిక్, ఎన్నారై టీఆర్‌ఎస్ అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీని ఘనంగా సన్మానించారు.