3 పంటలకు నూరు శాతం సూక్ష్మసేద్యం
- పామాయిల్, పసుపు, చెరకు భూములన్నింటికీ ఇవ్వాలని ఉద్యానశాఖ నిర్ణయం
- ఈ ఏడాది రూ. వెయ్యి కోట్లతో 2 లక్షల ఎకరాల్లో పథకం అమలు
- అక్రమాలు జరగకుండా దేశంలోనే మొదటిసారిగా జియోఫెన్సింగ్
సాక్షి, హైదరాబాద్: పామాయిల్, పసుపు, చెరకు సాగు చేసే భూములన్నింటినీ సూక్ష్మసేద్యం పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ ఉద్యానశాఖ నిర్ణయించింది. ఈ ఏడాది పెద్ద ఎత్తున సూక్ష్మసేద్యం పథకాన్ని రైతుల వద్దకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నాబార్డు నుంచి రూ. వెయ్యి కోట్ల రుణం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సొమ్ముతో ఈ ఏడాది 2 లక్షల ఎకరాలకు సూక్ష్మసేద్యాన్ని అందుబాటులోకి తేవాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. దీనిప్రకారం అన్ని పంటలకు పూర్తిస్థాయిలో సూక్ష్మసేద్యం అందజేయడం అసాధ్యమైనందున తక్కువ విస్తీర్ణంలో సాగులో ఉన్న పంటలపై దృష్టి పెట్టి వాటికి పూర్తిస్థాయిలో సూక్ష్మసేద్యాన్ని ఇవ్వాలని నిర్ణయించింది.
అలా ఏటా కొన్ని పంటలను లక్ష్యంగా పెట్టుకొని సూక్ష్మసేద్యాన్ని పూర్తిస్థాయిలో విస్తరించడం ద్వారా అన్ని పంట భూములనూ కవర్ చేయాలని ఉద్యానశాఖ యోచిస్తోంది. అయితే మిగిలిన పంటలు సాగు చేసే రైతులకు సూక్ష్మసేద్యం పరికరాలు ఇవ్వకూడదన్న నిబంధన ఏమీ పెట్టుకోలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పసుపు సాగు చేసే రైతులు అనేకమంది సూక్ష్మసేద్యం కలిగివున్నారు. చెరకు, పామాయిల్ భూములకూ అధికంగా ఇవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రచించారు.
జియోఫెన్సింగ్ ద్వారా వివరాలు నిక్షిప్తం...
సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకునే ఎస్సీ, ఎస్టీలకు నూటికి నూరు శాతం సబ్సిడీ ఇస్తారు. బీసీలు, ఇతర పేదలకు 90 శాతం, ఓసీలకు 80 శాతం సబ్సిడీ ఇస్తారు. దేశంలో ఇంత సబ్సిడీ ఇచ్చే రాష్ట్రం కూడా మనదే కావడం గమనార్హం. ఈసారి ఉద్యానశాఖ సూక్ష్మసేద్యంపైనే దృష్టిసారించనుంది. ఇప్పటి కే సూక్ష్మసేద్యం కోసం 38 వేల మంది రైతులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఆధార్ కార్డు, పాస్‌బుక్ వివరాలతోపాటు బయోమెట్రిక్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎట్టి పరిస్థితు ల్లోనూ పథకం దుర్వినియోగం కాదని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు.
సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసేందుకు 25 కంపెనీలకు అవకాశం కల్పించారు. వాటిల్లో రైతులు వారికి ఇష్టమైన కంపెనీని ఎంపిక చేసుకోవచ్చు. సూక్ష్మసేద్యం పొందిన రైతు పొలంలో ఆయా పరికరాలను బిగించాక సమయం, తేదీ తెలిపేలా డిజిటల్ ఫొటోలు తీయడంతోపాటు దేశంలోనే తొలిసారిగా భూమిని జియో ఫెన్సింగ్ చేయనున్నారు. దీనివల్ల గూగుల్ మ్యాప్‌లో సూక్ష్మసేద్యం పొందిన రైతు భూమి, సర్వే నంబర్ సహా పూర్తి వివరాలను చూసుకోవచ్చు. అలాగే అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చు. ఇందుకోసం ఉద్యానశాఖ వెబ్‌సైట్‌ను కూడా సిద్ధం చేసింది.
మన రాష్ట్రంలోనే ఈ తరహా విధానం...
దేశంలో ఎక్కడా ఇటువంటి పద్ధతిలో సూక్ష్మ సేద్యాన్ని అమర్చలేదని ఉద్యానశాఖ కమిష నర్ ఎల్.వెంకట్రామిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అంతేకాదు కంపెనీలు ఇచ్చే సూక్ష్మసేద్యం పైపులను గతంలో కొందరు అమ్ముకునే వారు. అయితే ఈసారి అటువంటి పరిస్థితి తలెత్తకుండా పైపులను నిర్ణీత కొలమానం ప్రకారం కోసి వాటిని బిగిస్తామన్నారు. అలాగే నాస్కామ్ ద్వారా పూర్తిస్థాయిలో తనిఖీలూ ఉంటాయన్నారు. తాము చేపట్టిన ఈ పారదర్శక పద్ధతిని గుర్తించిన కేంద్రం సూక్ష్మసేద్యం అమలు కోసం రూ.300 కోట్లు ప్రత్యేకంగా రాష్ట్రానికి కేటాయిం చిందని వెంకట్రామిరెడ్డి తెలిపారు.