ఉస్మానియాలోనే ఎమర్జెన్సీ, ఓపీ సేవలు
సాక్షి, హైదరాబాద్: ‘రోగుల తరలింపు అంశంపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఈ అంశంపై ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అత్యవసర వైద్య సేవలు సహా ఓపీ సేవలు ఉస్మానియాలోనే కొనసాగుతాయి’ అని మంత్రి సి.లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన క్షతగాత్రులు, ఇతర రోగులకు పూర్తి వైద్యసేవలు ఇక్కడే అందిస్తామన్నారు. ఆదివారం ఆయన నిమ్స్‌ను సందర్శించారు.
ఆస్పత్రిలో తొలి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేసిన వైద్యులను అభినందించారు. అనంతరం డెరైక్టర్ నరేంద్రనాథ్‌తో కలసి మంత్రి మాట్లాడుతూ నిరుపేద రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో ట్విన్ టవ ర్స్ నిర్మించి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. ఆస్పత్రి పాత భవనం ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, గత పాలకుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై అనవసర రాద్ధాంతం చేస్తోందని దుయ్యబట్టారు. పేదల గురించి మాట్లాడే కమ్యూనిస్టు నాయకులు కూడా ఆలోచించకుండా విమర్శించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
శస్త్రచికిత్సలన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే....
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతోందని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. అందులో భాగంగా ఇప్పటివరకు ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రుల్లో రెండు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.ఖరీదైన ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ సహకారంతో(రూ.10.50 లక్షలు) ఉచితంగా చేసినట్లు చెప్పారు. కాలేయ మార్పిడి చికిత్స కోసం నిమ్స్‌లో మరో ఐదుగురు రిజిస్ట్రర్ చేయించుకున్నారని, వారికి కూడా ప్రభుత్వ సహకారం అందిస్తామని తెలిపారు.