అందుబాటులోకి సరికొత్త పరిజ్ఞానం
♦ 15 నిముషాల్లోనే జన్యు రుగ్మతలు గుర్తించే వీలు
♦ సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ మోహన్‌రావు వెల్లడి
♦ జన్యు సమస్యలపై జాతీయ సదస్సు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: జన్యుపరమైన వ్యాధులను గుర్తించేందుకు సరికొత్త పరిజ్ఞానం అందుబాటులోకి రానుందని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డెరైక్టర్ సీహెచ్ మోహన్‌రావు వెల్లడించారు. అందుకోసం ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డిసీజెస్ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ సదస్సు ప్రారంభమైంది. రెండురోజులపాటు జరిగే ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మోహన్‌రావు మాట్లాడుతూ జన్యుపరమైన వ్యాధులను గుర్తించడం చాలా కీలకమైన అంశమన్నారు.
ప్రస్తుతం పాలిమర్ చైన్ రియాక్షన్, జీన్ సీక్వెన్సింగ్ ప్రకారం జన్యుపరమైన వ్యాధులను గుర్తిస్తున్నామన్నారు. కొత్తగా నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్ అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ కొత్త పరిజ్ఞానం ద్వారా మానవుల జన్యువులను క్షణ్ణంగా పరిశీలించవచ్చన్నారు. మానవుడి శరీరంలో ఎక్కడ లోపం ఉందో గుర్తించడానికి ఇది వీలు కల్పిస్తుందని తెలిపారు. ఇదిగాక నెక్ట్స్ టూ నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్ టెక్నాలజీ ప్రాథమిక స్థాయిలో పరిశోధనలో ఉందన్నారు. దానిద్వారా 15 నిముషాల వ్యవధిలోనే మనిషిలోని జన్యువులు, అందులో ఉండే లోపాలను గుర్తించవచ్చన్నారు. సదస్సు నిర్వాహక కమిటీ కన్వీనర్ డాక్టర్ బి.శ్రీనాధ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 17 లక్షల మంది పిల్లలు పుట్టుకతోనే లోపాలతో పుడుతున్నారన్నారు.
తెలంగాణలో ఇలా ఏటా 50 వేల మంది లోపాలతో పుడుతున్నారని పేర్కొన్నారు. జన్యుపరమైన రుగ్మతల కారణంగానే ఇలా జరుగుతోందని చెప్పారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) చేపట్టిందన్నారు. ఇందుకోసం తెలంగాణలో వైద్య సిబ్బంది నియామకం కూడా పూర్తయిందన్నారు. ప్రతీ ఏడాది కొత్త రుగ్మతలు పుట్టుకొస్తున్నాయన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ యూజీసీ విభాగం డీన్, ప్రొఫెసర్ ఎ.రవీంద్రనాథ్, డెరైక్టర్ ప్రొఫెసర్ ఎ.జ్యోతి, ప్రొఫెసర్ ఉమ, ప్రొఫెసర్ కైసర్ జమీల్, ప్రొఫెసర్ పి.పి.రెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రతీ ఏడూ కొత్తగా వస్తున్న జన్యుపరమైన రుగ్మతలను శాస్త్రవేత్తలు కనుగొంటూనే ఉన్నారన్నారు. జన్యుపరమైన వ్యాధులను నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం పరిశోధనా కేంద్రాలు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కాకర్ల సుబ్బారావు, ప్రొఫెసర్ దీపిక తదితరులు పాల్గొన్నారు.