హైదరాబాద్: ఓయూసెట్-2016 ఫలితాల్లో అబ్బాయిలు సత్తా చాటారు. అమ్మాయిలతో పోల్చుకుంటే అబ్బాయిలు ఒక శాతం అధికంగా అర్హత సాధించారు. పలు పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఓయూసెట్-2016 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మొత్తం 94.26 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. ఓయూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఈ. సురేష్‌కుమార్, అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ డి. అశోక్‌లు కలిసి ఫలితాలను వెల్లడించారు.
మొత్తం 40 పీజీ, 10 పీజీ డిప్లొమా, 3 ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. పలు కోర్సుల్లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య కంటే.. దర ఖాస్తులు తక్కువగా అందడంతో.. ఆయా కోర్సులకు ప్రవేశ పరీక్ష నిర్వహించ లేదు. మొత్తం 45 కోర్సులకు ఈనెల 6 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 65,494 మంది పరీక్ష రాయగా.. 61,732 మంది ప్రవే శాలకు అర్హత పొందారు. అన్ని కోర్సుల్లో కలిపి దాదాపు 18,800 సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
నెలాఖరులో వెబ్ ఆప్షన్లు..
ర్యాంకు కార్డులను ww.osmania.ac.in, www.ouadmissions.com వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టారు. ర్యాంకు కార్డులను అభ్యర్థులకు నేరుగా చేరవేయడం లేదు. అందరూ వెబ్‌సైట్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి ఈ నెలాఖరులో సమయమిస్తామని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ వచ్చేనెల రెండో వారంలో నిర్వహిస్తామన్నారు. ఖరారు చేసిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.