
మా గెలుపు ఖరారైంది
♦ జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్
♦ హైదరాబాదీలు ఇంకా ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొని ఉంటే బాగుండేది
♦ పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటే మెజారిటీ మరింతగా పెరిగేది
♦ ఏడు స్వతంత్ర సర్వేలు టీఆర్‌ఎస్ గెలుస్తుందని చెబుతున్నాయని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ‘‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో మా గెలుపు ఖరారైంది. ఈ ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరిగాయి. తమ ఓటమికి సాకులు వెతుక్కునే పనిలో కాంగ్రెస్, టీడీపీ-బీజేపీ కూటమి ఉన్నాయి. అందుకే అధికార దుర్వినియోగం జరిగిందంటూ ఉత్తమ్, కిషన్‌రెడ్డి కొత్త పాట ఎత్తుకున్నారు. స్వతంత్రంగా జరిగిన ఏడు సర్వేలు టీఆర్‌ఎస్ గెలుస్తుందని చెబుతున్నాయి..’’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. హైదరాబాదీలు ఇంకా పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొని ఉంటే టీఆర్‌ఎస్ మెజారిటీ మరింతగా పెరిగేదన్నారు.
మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం మరింతగా పెరగాల్సిందని, ఓటింగ్‌కు దూరంగా ఉండడం వల్ల సాధించేదేమీ ఉండదని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని... చివరలో ఎంఐఎం-టీఆర్‌ఎస్ మధ్య, ఎంఐఎం-కాంగ్రెస్ మధ్య జరిగిన ఘటనలు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడా గొడవల్లేవు కాబట్టి, రీపోలింగ్‌కు అవకాశం ఉండకపోవచ్చని భావిస్తున్నామన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయనడానికి రెండు రోజులుగా టీఆర్‌ఎస్ నేతలపై కూడా కేసులు నమోదు కావడమే ఉదాహరణ అని కేటీఆర్ చెప్పారు.
కేసీఆర్ పట్ల విశ్వాసమే గెలుపు బాట..
‘‘మా గెలుపు ఖరారైంది. అధికారికంగా 5వ తేదీన వెలువడే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం. ఈ ఎన్నికల్లో ‘కారు-సారు’ నినాదంతో ప్రజల వద్దకు వెళ్లాం. మా నాయకుడి దీక్షాదక్షత, సమర్థత, ఆయన పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసమే మా గెలుపునకు బాటలు వేస్తున్నాయి..’’ అని చెప్పారు. ఇక సీపీఐ నేత నారాయణ అంటే తమకు గౌరవం ఉందని, రాయలసీమ నేత అయి ఉండి కూడా తెలంగాణకు మద్దతుగా నిలిచారని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ నారాయణ వాస్తవాలు అంచనా వేయకుండా మాట్లాడడం సరికాదన్నారు. ఎన్నికల వేడిలో సంఘటనలు జరుగుతాయని, కోపతాపాల ప్రదర్శనలు వద్దని, సంయమనం కోల్పోవద్దని చెప్పారు.
టీఆర్‌ఎస్ అంటే సుముఖంగా లేని వారు కూడా సర్వేలు చేసి, డెబ్బైకి పైగా స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుస్తున్నట్లు తేల్చారని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ గత 18 నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారని చెప్పారు. సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని, టీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బాల్క సుమన్, సీతారాం నాయక్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.