
ప్రజల భాగస్వామ్యంతో విశ్వనగరం
మంత్రి కేటీఆర్ వెల్లడి
టీఆర్‌ఎస్ గ్రేటర్ మేనిఫెస్టో ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ప్రజల భాగస్వామ్యంతో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో టీఆర్‌ఎస్ ప్రణాళికలు తయారుచేసిందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె. తారకరామారావు చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైతే చట్టాలను మార్చేందుకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు. గ్రేటర్ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించినట్లు పేర్కొన్నారు. శనివారమిక్కడ తెలంగాణ భవన్‌లో ఆయన రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు, సలహాదారు డి. శ్రీనివాస్, ఎంపీ బాల్కసుమన్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులతో కలసి టీఆర్‌ఎస్ మేనిఫెస్టోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నేలవిడిచి సాము చేయకుండా టీఆర్‌ఎస్ అభ్యర్థి మేయర్‌గా ఎన్నికైన తరువాత చేసే పనులనే మేనిఫెస్టోలో పొందుపరిచామన్నారు. ఎంఐఎం, టీడీపీ- బీజేపీ, కాంగ్రెస్‌ల పాలనలో హైదరాబాద్ అభివృద్ధి తిరోగమనం చెందిందని, ఐదేళ్లు టీఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో గత పాలకులు మౌలిక సదుపాయాలను కల్పించలేదని మండిపడ్డారు. మౌలిక అవసరాలపై దృష్టి పెట్టకపోతే అభివృద్ధి అసాధ్యమని గుర్తించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేసిందన్నారు. ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ పారదర్శకంగా పాలన సాగించాలని టీఆర్‌ఎస్ నిర్ణయించిందని, అందుకే చేయనున్న పనులను అంకెలతో సహా మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు చెప్పారు.
అన్నింటా ముందున్నది టీఆర్‌ఎస్సే!
గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక మొదలు, టికెట్ల ప్రకటన, ఎన్నికల ప్రచారం వరకు అన్ని పార్టీల కన్నా టీఆర్‌ఎస్ ముందుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అదే ఒరవడిని కొనసాగిస్తూ మేనిఫెస్టోను కూడా టీఆర్‌ఎస్ ముందుగానే విడుదల చేసిందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ముస్లింలకు 23 మందికి టికెట్లు ఇచ్చామని, ఎంఐఎంతో ములాఖత్, రహస్య ఒప్పందం చేసుకున్నారని బీజేపీ, ఇతర పార్టీలు చేసిన విమర్శలకు తామిచ్చిన టికెట్లే సమాధానమని చెప్పారు. ‘గాంధీభవన్‌కు తాళాలేశారు. టీడీపీ, బీజేపీ ఆఫీసుల్లో అర్ధనగ్న ప్రదర్శనలు జరుగుతున్నాయి. టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు వీటికి అదనం. ఇవేమీ లేకుండా మా పార్టీలో టికెట్ల పంపిణీ నుంచి ప్రచారం వరకు అన్నీ స్వేచ్ఛగా, పారదర్శకంగా నడుస్తున్నాయి’ అని పేర్కొన్నారు. ‘చంద్రబాబు, జానారెడ్డిలు పార్టీలు మారి పదవులు పొందితే తప్పులేదు. కిందిస్థాయి నాయకులు టీఆర్‌ఎస్‌పై నమ్మకంతో పార్టీ మారి ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పా?’ అని ప్రశ్నించారు.
సవాల్ కు కట్టుబడ్డా...
‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠంపై గులాబీ జెండా ఎగరకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న సవాల్‌కు కట్టుబడి ఉన్నా. దాన్ని షబ్బీర్ అలీ వంటి కొందరు నాయకులు వక్రీకరించి, వంద సీట్లు గెలవకపోతే రాజీనామా చేస్తారా ? అని ప్రశ్నిస్తున్నారు. అంటే మేయర్ పదవి టీఆర్‌ఎస్‌కు ఖాయమని వారు ఒప్పుకుంట్నుట్లే కదా. ఇప్పటికీ నేను ఆ సవాల్‌కు కట్టుబడే ఉన్నా. మేయర్ సీటును టీఆర్‌ఎస్ గెలుచుకోకపోతే రాజీనామా చేస్తా. మీరు సిద్ధమా?’ అని కేటీఆర్ ప్రతిపక్షాలను మరోసారి ప్రశ్నించారు.
ప్రజల ఎజెండా: కేకే
గ్రేటర్‌లో ప్రజల ఎజెండాను ప్రతిబింబించేలా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించినట్లు రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు చెప్పారు. సామాజిక న్యాయం పాటిస్తూ నూతన శకానికి నాంది పలుకుతూ టీఆర్‌ఎస్ సీట్లు కేటాయించిందన్నారు. 150 మందిలో 68 మంది బీసీలకు సీట్లు ఇవ్వడమే గాక, బీసీల్లోని 21 కులాలకు ప్రాతినిధ్యం కల్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ సలహాదారు డి. శ్రీనివాస్ మాట్లాడుతూ, మేనిఫెస్టోలో చెప్పిన పనులన్నీ ఐదేళ్లలో చేస్తామని, ఇందులో పొందుపరచని అంశాలు కూడా రాబోయే ఐదేళ్లలో చేపడతామని పేర్కొన్నారు.
30న కేసీఆర్ సభ
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి సీఎం కేసీఆర్ పాల్గొనే భారీ బహిరంగసభను ఈనెల 30న నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో ఈ సభ నిర్వహించాలని నిర్ణయించామని, రక్షణ శాఖ నుంచి తుది అనుమతి రావాల్సి ఉందన్నారు. ఒకవేళ జింఖానా గ్రౌండ్స్‌లో అనుమతి రాకపోతే వేరేచోట జరుపుతామని, 30న మాత్రం బహిరంగసభ జరుగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా రెండు మూడు రోజుల పాటు కేసీఆర్ రోడ్‌షోలు నిర్వహించడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారనే కారణంతో ఒకరోజు బహిరంగసభనే నిర్వహిస్తున్నట్లు చెప్పారు.చంద్రబాబు మూడు రోజుల రోడ్‌షో నిర్వహణను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. అయినా చంద్రబాబు రోడ్‌షోల్లో ఎవరికి ఓట్లేయాలని అడుగుతారో తెలియడం లేదని, టీడీపీ-బీజేపీ పొత్తు కలహాల కాపురంగా మారిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎంత ప్రచారం చేస్తే టీఆర్‌ఎస్‌కే అంత లాభమని వ్యాఖ్యానించారు.
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు
► హైదరాబాద్‌ను సురక్షిత, సుందరమైన, ప్రేమపూర్వక నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. ఇందులో భాగంగానే గ్రేటర్‌లో లక్ష సీసీ కెమెరాల ఏర్పాటు ప్రారంభించాం. -గ్రేటర్‌లోని 1,500 మురికివాడలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, మురికివాడరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నాం.
► ప్రతి వ్యక్తికి రోజు 150 లీటర్ల మంచినీరు, నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తాం. భూగర్భ డ్రైనేజీ ఆధునీకరణ చేపడతాం.
-హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల వద్ద ఆహ్లాదకర వాతావరణం తెస్తాం. మూసీ వెంట 42 కి.మీ. ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తాం.
► హుసేన్‌సాగర్‌తోపాటు చెరువుల సంరక్షణ, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం వంటి మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తాం.
► శ్మశానవాటికలను ఆధునీకరిస్తాం.
► దేశంలో ఒలింపిక్స్ నిర్వహించే నాటికి హైదరాబాద్‌ను వేదికగా మారుస్తాం.
► నగరంలో ప్రత్యేకంగా సైకిల్ ట్రాక్‌లు, వెయ్యి బ యో టాయిలెట్స్ నిర్మిస్తాం.