ఔట్లుక్ చెప్పీ చెప్పని క్షమాపణలు!
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వివాదంపై 'ఔట్లుక్' పత్రిక చెప్పీ చెప్పనట్లుగా క్షమాపణలు చెప్పింది. 'ద బోరింగ్ బాబు' అనే కథనంలో తాము ఎవరి పేర్లూ పేర్కొనలేదని, అయినా.. తమకు తెలంగాణ ప్రభుత్వంలోని ఓ అధికారి లీగల్ నోటీసులు పంపారంటూ కొన్ని వార్తా పత్రికలు, టీవీ న్యూస్ చానళ్లు, వెబ్ సైట్లు చెప్పాయని ఔట్లుక్ పేర్కొంది. అయితే, మీడియా గందరగోళం మొదలై 36 గంటలు దాటిపోయినా, తమకు మాత్రం ఎలాంటి నోటీసు రాలేదని తెలిపింది. సోషల్ మీడియాలో కూడా తమ పత్రిక కరస్పాండెంటుపై వ్యక్తిగత దాడులు జరుగుతున్నాయని, ఆమెపై దాడి చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆ కథనంలో రాశారు.
తాము సర్వసాధారణంగానే తమ పత్రికలో కొన్ని సెటైర్లు రాస్తామని, అయితే అందులో ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశం తమకు లేదని, దాన్ని తేలిగ్గా తీసుకోవాలని అన్నారు. అయినా.. పరిస్థితి సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కథనం మొత్తాన్ని తాము తీసేశామని తెలిపారు. ఒకవేళ ''ఏదైనా తప్పు జరిగినట్లయితే'' అందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. గత 20 ఏళ్లుగా తాము మానవహక్కులు, మహిళల హక్కులు, మైనారిటీ హక్కులు, వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడుతూనే వచ్చామని, ఈ విషయం తమ పాఠకులు అందరికీ తెలుసని కూడా చెప్పుకొన్నారు.